22 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నా.. టీఆర్ఎస్‌కు సీనియర్ నేత రాజీనామా

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.  తెలంగాణ ఉద్యమ సమయం నుంచి సీఎం కేసీఆర్ వెంట ఉన్న సీనియర్ నేత.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీఆర్ఎస్‌ కు రాజీనామా చేస్తున్నట్లు కన్నెబోయిన రాజయ్య యాదవ్ ప్రకటించారు. గులాబీ పార్టీతో ఉన్న 22 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు తెలిపారు. ఆ పదవి ఇస్తా..  ఈ పదవి ఇస్తా.. అంటూ సీఎం కేసీఆర్.. తనను ఎన్నోసార్లు మోసం చేశారని ఆయన ఆరోపించారు.  పదవుల సంగతి తర్వాత గానీ… కనీసం పలకరించే వారే కరువయ్యారని అన్నారు. పార్టీలో ఆత్మగౌరవం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు రాజయ్య.

” టీఆర్ఎస్‌లో ఒక కార్యకర్తగా సుదీర్ఘ కాలం పనిచేశాను. కానీ పార్టీలో ఆత్మగౌరవం లేదు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది. మెదక్ ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి..మాట తప్పారు. విజయశాంతికి ఇచ్చారు. రాజ్యసభకు పంపుతామన్నారు. కానీ బడుగుల లింగయ్యకు ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. దానికీ పంపించలేదు. ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఆత్మ గౌరవం లేదు. తెలంగాణ కోసం ఎంతో పోరాడాం. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు చోటు లేకుండాపోయింది. టీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమకారులకు బాధ తప్ప.. భవిష్యత్ లేదు. గతంలో నన్ను అన్నా అన్న వారు కూడా.. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే తీయట్లేదు. పదవులు కాదు.. కనీసం పలకరించే వారు కూడా లేరు. ప్రస్తుతం పార్టీలో అంతా బాగుండొచ్చు. కానీ అనేక పార్టీలు కూడా ఇలానే వ్యవహరించి మాయమయ్యాయి. తలెత్తుకోవాలని బతకాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నా. నా బాటలోనే మరికొందరు నేతలు కూడా టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారు.” అని కన్నబోయిన రాజయ్య యాదవ్ పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ ఉద్యమ తొలినాళ్ల నుంచి సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేసిన నాయకుడిగా రాజయ్య యాదవ్‌కు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పట్లో కేసీఆర్ ఆరుగురు సీనియర్ నేతలతో కలిసి దీక్ష చేసిన నాయకుల్లో రాజయ్య కూడా ఉన్నారు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్టయ్యి.. ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు ఉన్నారు. అలాంటి సీనియర్ నేత ఇప్పుడు టీఆర్ఎస్‌కు రాజీనామా చేయడం.. తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రాజయ్య యాదవ్ చెప్పారు. ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!