శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన రణిల్​ విక్రమసింఘే

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం శ్రీలంక పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా 73 ఏళ్ల విక్రమసింఘేతో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా రణిల్ ను శ్రీలంక పార్లమెంటు ఎన్నుకుంది. 
221 ఓట్లకు గాను విక్రమసింఘేకు మొత్తం 134 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రధాన ప్రత్యర్థి దులాస్ అలహప్పెరుమకు 82 ఓట్లు లభించగా.. లెఫ్టిస్ట్ అనురా దిసానాయకు కేవలం మూడు ఓట్లు మాత్రమే లభించాయి. మొదటి ప్రాధాన్యత ఓటింగ్ లోనే రణిల్ కు పూర్తి మెజారిటీ లభించింది. ఎన్నికల్లో మొత్తం 223 ఓట్లు పోలవగా.. ఇద్దరు ఎంపీల ఓట్లు చెల్లుబాటు కాలేదు. విక్రమసింఘే గతంలో ఆరుసార్లు శ్రీలంక ప్రధానమంత్రిగా పని చేశారు. 
ఎంతో అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు రణిల్ విక్రమసింఘే ముందు ఇప్పుడు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సి ఉంటుంది. అలాగే, కొన్ని నెలలుగా ప్రజా ఆందోళనల తర్వాత పరిపాలనను పునరుద్ధరించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కాగా, విక్రమసింఘే ఇప్పుడు తన క్యాబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు. కొన్ని రోజుల్లో  20-25 మందితో క్యాబినెట్‌ను ఏర్పాటు చేస్తారని సమాచారం.

Nationalist Voice

About Author

error: Content is protected !!