విశాఖ శారదాపీఠధిపతి చాతుర్మాస్య దీక్ష ప్రారంభం

రుషికేశ్‌ : విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ బుధవారం ఉదయం పవిత్ర చాతుర్మాస్య దీక్ష ప్రారంభించారు. రుషికేష్‌లో ఉన్న శ్రీశారదాపీఠంలో గురుపూర్ణిమ సందర్భంగా వీరిరువురూ ఈ దీక్ష తీసుకున్నారు. గురు పూర్ణిమ పర్వదినం రోజున వ్యాస పూజతో ఈ చాతుర్మాస్య దీక్షకు అంకురార్పణ జరిగింది. ఆది శంకరుని శంకరభాష్యాన్ని, ప్రస్థానత్రయ భాష్యాన్ని పఠిస్తూ పరమ పవిత్రంగా దీక్షను కొనసాగిస్తారు. సెప్టెంబరు 20న చాతుర్మాస్య దీక్ష ముగిసేంత వరకు స్వామీజీలు రుషికేశ్‌లోనే ఉంటారు. స్వామీజీకిది 26వ దీక్ష కాగా, స్వాత్మానందేంద్ర సరస్వతికిది నాలుగోది.ఉదయం పుర్ణాహుతి అనంతరం వ్యాస పూజ నిర్వహించారు. ఈ పూజలో శ్రీకృష్ణుడు, వ్యాసుడు, దక్షిణామూర్తి సహా 45 మంది గురువులను ఆరాధిస్తూ అర్చన చేపట్టారు. దీక్షా సమయంలో సాధువులు, సన్యాసులకు అన్నదానం నిర్వహించి దక్షిణలు సమర్పిస్తారు. దీక్షా కాలంలో పీఠానికి పరంపరానుగతంగా వచ్చిన గురువులను స్వామీజీలు నిరంతంర స్మరించుకుంటారు. గంగమ్మతల్లికి నిత్య పూజలు చేసిన తర్వాత శ్రీశారదా పీఠం అధిష్టాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరులకు నిత్య పీఠార్చన చేస్తారు. మొదటి నెలలో కూరలు, రెండో నెలలో పెరుగు, మూడో నెలలో పాలు, నాలుగో నెలలో పప్పు ధినుసులను తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తారు.దీక్ష కాలంలో నిత్యం పీఠాధిపతులు తమ స్వహస్తాలతో గంగానదికి హారతులిస్తారు. వేద విద్యార్థులకు స్వామీజీ ధార్మిక అంశాలను బోధిస్తారు. దీక్షా కాలంలో వినయక చవితి, కృష్ణాష్టమి వేడుకలను ఆశ్రమంలోనే జరుపుతారు. చాతుర్మాస దీక్ష పూర్తయ్యేంత వరకు స్వామీజీలు ఎలాంటి పర్యటనలు చేయరు. స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రుషికేష్‌కు వెళ్తుంటారు.

కాకినాడలో విజయేంద్ర సరస్వతి దీక్ష
మూలామ్నాయ కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం కాకినాడలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో 39వ చాతుర్మాస్య దీక్షను ప్రారంభించారు. ఉదయం వేళ వ్యాస పూజ నిర్వహించిన అనంతరం దీక్షకు అంకురార్పణ జరిగింది. సెప్టెంబరు 10 వరకు ఈ దీక్ష కొనసాగనున్నది. జగద్గురువు శంకరాచార్య పరమార్థం మేరకు దీక్ష చేపట్టడుతున్నారు. చాతుర్మాస్య దీక్ష సందర్భంగా యోగ లింగ చంద్రమౌళీశ్వర సమేత మహా త్రిపురసుందరికి నిత్యం మూడుసార్లు నిత్య పూజలు నిర్వహిస్తారు. చత్రుమాస్య వ్రత దీక్షలో స్వామివారు అత్యంత భక్తిశ్రద్ధలతో జప, తప, ధ్యానాలు చేయనున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!