వాట్సప్ ఎందుకు ఆగింది? అంతరాయంపై వివరణ ఇచ్చిన యాజమాన్యం

  • సాంకేతిక సమస్య వల్లే ఆగిపోయిందని వెల్లడించిన మెటా ప్రతినిధి
  • మంగళవారం రెండు గంటల పాటు నిలిచిన సర్వీసులు
  • అదే సమయంలో సాఫీగా నడిచిన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, మెసెంజర్
భారత్ తో పాటు పలు దేశాలలో మంగళవారం వాట్సప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు రెండు గంటల పాటు కోట్లాది మంది వినియోగదారుల యాప్, వెబ్ క్లయింట్‌లు పనిచేయలేదు. దీనివల్ల వినియోగదారులు మెసేజ్లను పంపలేకపోయారు. ఆడియో, వీడియో కాల్స్  కూడా కనెక్ట్ కాలేదు. రెండు గంటల అంతరాయం తర్వాత వాట్సప్ సేవలు పునరుద్ధరించడంతో వినియోగదారులకు ఉపశమనం కలిగింది. కాగా, వాట్సప్ సేవలకు ఎందుకు అంతరాయం కలిగిందో దాని యాజమాన్యం అయిన మెటా వివరణ ఇచ్చింది. మెటా ప్రతినిధి ఒకరు ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ.. తమ వైపు నుంచి సాంకేతిక లోపం కారణంగా వాట్సప్ కొద్దిసేపు ఆగిపోయిందని తెలిపారు. ఆ సాంకేతిక లోపానికి కారణం ఏమిటనే విషయాన్ని మాత్రం మెటా వెల్లడించలేదు.

కాగా, ఆరేళ్ల కిందట ఇదే అక్టోబర్ లో వాట్సప్ కొద్దిసేపు ఆగిపోయింది. ఆ సమయంలో డీఎన్ఎస్ (డొమైన్ నేమ్ సిస్టమ్) సంబంధిత సమస్య కారణంగా తమ సేవలు నిలిచిపోయాయని కంపెనీ తెలిపింది. తాజాగా మరోసారి అలాంటి సమస్య కారణంగానే సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.
కాగా, మంగళవారం సమస్య ఏర్పడిన సమయంలో 69 శాతం మంది వినియోగదారులు సందేశాలను పంపడంలో సమస్యలను ఎదుర్కొన్నారని, 21 శాతం మంది వినియోగదారులు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నారని అవుట్‌టేజ్ ట్రాకర్, డౌన్‌డెటెక్టర్ తెలిపాయి. ఇక, తెలియని కారణాల వల్ల దాదాపు 9 శాతం మంది వినియోగదారులు యాప్‌ను ఉపయోగించలేకపోయారు. కాగా, వాట్సప్స్ లో  ఇలాంటి సమస్యలు ఎదురైన సమయంలో దాని మాతృ సంస్థ మెటా ఆధ్వర్యంలోని ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, మెసెంజర్ మాత్రం బాగానే పని చేశాయి.

Nationalist Voice

About Author

error: Content is protected !!