వరల్డ్ కప్ పై వరుణుడి పంజా… ఒక్క బంతి పడకుండానే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు

  • మెల్బోర్న్ లో కొన్ని రోజులుగా వర్షాలు
  • చిత్తడిగా మారిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్
  • నేడు ఒక్కరోజే రెండు మ్యాచ్ ల రద్దు
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ పై వరుణుడు పగబట్టినట్టుంది! నేడు జరగాల్సిన రెండు మ్యాచ్ లు వర్షార్పణం అయ్యాయి. ఈ ఉదయం ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ వేయకుండానే రద్దు కాగా… ఈ మధ్యాహ్నం జరగాల్సిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ కూడా ఒక్క బంతి పడకుండానే రద్దయింది.

ఈ రెండు మ్యాచ్ లకు వేదికైన మెల్బోర్న్ లో కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం తర్వాత మెల్బోర్న్ లో వర్షం కురవకపోయినా, మైదానం ఆటకు ఏమాత్రం అనువుగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చెరో పాయింట్ ను దక్కించుకున్నాయి.

రెండ్రోజుల కిందట కూడా న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం ప్రభావంతో రద్దయింది. ఇది కూడా మెల్బోర్న్ లో జరగాల్సిన మ్యాచే. పాపం… ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటిదాకా రెండు మ్యాచ్ లను వరుణుడికి సమర్పించుకోవాల్సి వచ్చింది.

ఇటీవల దక్షిణాఫ్రికా-జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది. అటు, ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ వర్షం కారణంగా డక్ వర్త్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏదేమైనా, సూపర్-12 దశలో వర్షం అనేక జట్ల అవకాశాలను దెబ్బతీస్తోంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!