లైన్‌మెన్‌తో గొడవ …. రైతుకు షాకిచ్చిన విద్యుత్‌ సిబ్బంది

 వికారాబాద్‌: ఓ సామాన్య రైతు ఇంటికి సంబంధించి నెలకు రూ.65వేల విద్యుత్‌ బిల్లు రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండల పరిధిలోని సొండేపూర్‌ మైసమ్మ చెరువుతండాకు చెందిన రెడ్యానాయక్‌ వ్యవసాయ కూలీ.. రోజు కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇంటికి సర్వీస్‌ నంబర్‌ 58లో విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నాడు. ప్రతినెల విద్యుత్‌ బిల్లు సక్రమంగానే చెల్లిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం లైన్‌మెన్‌.. రెడ్యానాయక్‌తో మీటర్‌ బాగాలేదు వేరే మీటర్‌ బిగించాలని చెప్పడంతో రైతు.. లైన్‌మెన్‌కు రూ.2వేలు ఇచ్చాడు.

డబ్బులిచ్చి సంవత్సరం దాటినా కొత్త మీటర్‌ బిగించకపోవడంతో రెడ్యానాయక్‌ గత నెల (జూన్‌)లో లైన్‌మెన్‌ను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు లైన్‌మెన్‌ వచ్చే నెల చూడు నీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో అని రైతుకు చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం జూలై నెలకు సంబంధించి ఏకంగా రూ.65,240 బిల్లు వచ్చింది. దీంతో ఏమి చేయాలో తోచక రైతు విద్యుత్‌ ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే కాలుస్తేనే అంత బిల్లు వస్తదిగా అని నిర్లక్షంగా సమాధానం ఇచ్చారు.

ఎన్నడూ రానంతగా ఇంతమొత్తంలో విద్యుత్‌ బిల్లు వస్తే ఎం చేయాలని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతినెల రూ.100లోపు బిల్లు వచ్చేదని దానిని నిర్ణీత గడువులోపు చెల్లిస్తూనే ఉన్నాని.. లైన్‌మెన్‌ కావాలనే బిల్లు ఎక్కువ వచ్చేలా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై విద్యుత్‌ ఏఈ ఖజాను వివరణ కోరగా 2014నుంచి రైతు మినిమం బిల్లును ప్రతి నెల కడుతున్నాడని అందుకే రీడింగ్‌ జామ్‌ అయ్యి అంత బిల్లు వచ్చిందన్నారు. రైతుకు బిల్లులో రూ.33వేలు తగ్గించామని చెప్పారు. 

Nationalist Voice

About Author

error: Content is protected !!