రూ.100 కోట్లు ఇస్తే మంత్రి పదవి అంటూ ఆఫర్.. మహారాష్ట్రలో నలుగురి అరెస్ట్

మహారాష్ట్రలో మంత్రి పదవి ఆశ చూపి భారీ మోసానికి వేసిన స్కెచ్ బయట పడింది. దాండ్ బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ కౌల్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. కౌల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. జులై 16న రియాజ్ షేక్ అనే వ్యక్తి రాహుల్ కౌల్ వ్యక్తిగత కార్యదర్శికి కాల్ చేశాడు. తాను ఒక ఆఫర్ గురించి చర్చించడానికి కౌల్ ను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు.
ఆ తర్వాత ముంబైలోని ఓ హోటల్ లో కౌల్ ను ఆ వ్యక్తి కలుసుకున్నాడు. ఓ సీనియర్ రాజకీయవేత్త ఈ పని చేసి పెడతాడని, (మంత్రి పదవి ఇప్పించడం), ఇందుకు రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. దీనికి కౌల్ సైతం ఆసక్తి చూపించారు. కాకపోతే తాను రూ.90 కోట్లే ఇచ్చుకోగలనని చెప్పారు. దీనికి ఓకే చెప్పిన రియాజ్ 20 శాతాన్ని అడ్వాన్స్ కింద చెల్లించాలని కోరాడు. దీనికి సరేనని చెప్పిన రాహుల్ కౌల్ తర్వాత వచ్చి తీసుకెళ్లాలని సూచించారు.
జరిగిన వ్యవహారాన్ని పార్టీలోని సీనియర్లతో కౌల్ పంచుకున్నారు. వారి సూచనలతో మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీన్ని క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించారు. రాహుల్ కౌల్ ను హోటల్లో కలసి రూ.18 కోట్ల అడ్వాన్స్ తీసుకునేందుకు వచ్చిన రియాజ్, అతడి సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రియాజ్ షేక్, యోగేష్ కులకర్ణి, సాగర్ సంఘ్వి, జాఫర్ ఉస్మానీ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. మహారాష్ట్రలో షిండే మంత్రివర్గ విస్తరణకు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
Nationalist Voice

About Author

error: Content is protected !!