యాదాద్రిలో ప్రమాణం చేసేందుకు వెళ్తున్న బండి సంజయ్.. పోలీసుల మోహరింపు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్‌ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన ఘటన సంచలనం సృష్టించిన వేళ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ సవాలు విసిరారు. మొయినాబాద్‌ ఫాంహౌస్ వేదికగా జరిగిన పరిణామాల్లో తన పాత్ర లేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రావాలని కేసీఆర్ను బండి‌ సంజయ్ డిమాండ్ చేశారు.

మునుగోడులోని మర్రిగూడ నుంచి యాదాద్రికి బండి సంజయ్ బయలుదేరారు. దీంతో యాదాద్రి పరిసర ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. బీజేపీ శ్రేణులు అక్కడకు వెళ్లకుండా వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. బండి సంజయ్ యాదాద్రి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు మోహరించారు. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంలో బీజేపీ ప్రమేయం ఏముందో కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.

మునుగోడులో భయంతోనే డ్రామాకు తెరదీశారని 10 టీవీతో అన్నారు. తమ నిజాయితీని నిరూపించుకునేందుకు వెళ్తుంటే తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తాను యాదాద్రిలో ప్రమాణం చేస్తానని, కేసీఆర్ కు దమ్ముంటే ఆయన కూడా వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. ఫాంహౌస్ లో ఎన్ని డబ్బులు దొరికాయో చెప్పాలని అన్నారు. మరోవైపు, యాదాద్రిలో టీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు దిగారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!