‘యశోద’లో నా పాత్ర ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది: వరలక్ష్మీ శరత్ కుమార్!

  • సమంత ప్రధానమైన పాత్రలో నటించిన ‘యశోద’
  • కీలకమైన పాత్రను పోషించిన వరలక్ష్మి
  • ఈ సినిమా కోసం 15 కేజీల బరువు తగ్గానని వెల్లడి
  • వచ్చేనెల 11వ తేదీన సినిమా విడుదల
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో లేడీ విలనిజం గురించిన ప్రస్తావన రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమాతో పరిచయమైన ఆమె, ఆ తరువాత ‘క్రాక్’ .. ‘నాంది’ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి.

సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ‘యశోద’ సినిమాలోను వరలక్ష్మి ఒక కీలకమైన పాత్రను చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. “ఈ సినిమాలో నేను మధుబాల పాత్రను పోషించాను. ఈ కథ వినగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇలాంటి ఒక ఆలోచన ఎలా కలిగిందబ్బా అనుకున్నాను. వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. తప్పకుండా ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకుని వస్తుంది” అన్నారు.

“ఈ సినిమాలో నా పాత్ర ప్రారంభం ఒక రకంగా ఉంటుంది. విశ్రాంతికి ముందు .. ఆ తరువాత మరో రకంగా కనిపిస్తుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి మరో విధంగా అనిపిస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతూ ఉండటమే ఈ పాత్రలోని ప్రత్యేకత. ఈ పాత్ర కోసం నేను 15 కేజీల బరువు తగ్గాను. నా కెరియర్లో ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. నవంబర్ 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!