మేం ఎదురుతిరిగితే మీరు తట్టుకోగలరా?: సజ్జల రామకృష్ణారెడ్డి

  • గుంటూరులో పార్టీ సమావేశంలో మాట్లాడిన సజ్జల
  • తన పాలనపై చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేదని వ్యాఖ్య
  • మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం విపక్షాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని విపక్షాలకు చెందిన నేతలు నోటికొచ్చిన బూతులు తిడుతున్నారన్న ఆయన.. తాము ఎదురుతిరిగితే తట్టుకోగలరా..? అంటూ హెచ్చరించారు. వికేంద్రీకరణపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలతో ఎవరూ రెచ్చిపోవద్దన్న సజ్జల… బండబూతులు తిడుతున్న వారికి మాత్రం బుద్ధి చెప్పాలన్నారు. ఈ మేరకు  గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.

2014లో ప్రజలు పట్టం కడితే చంద్రబాబు రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టారని సజ్జల ఆరోపించారు. మనం ఏం చేశామో చెప్పుకోగలమన్న ఆయన… చెప్పుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేదన్నారు. ఓ నటుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు వద్ద పవన్‌ తన అభిమానాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. మూడు రాజధానులు ప్రకటించిన తర్వాతే అమరావతి ప్రాంతంలో మనం అన్ని ఎన్నికల్లోనూ గెలిచామన్న సజ్జల.. మూడు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాల్సి ఉందని, మూడు రాజధానుల వల్లే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!