మీరు పోలీసులేనా? అని ప్రశ్నించినందుకు సైనికుడిపై దాడి.. ఏపీలో దారుణ ఘటన

  • ‘దిశ యాప్’ ఇన్‌స్టాల్ ప్రక్రియలో వచ్చే ఓటీపీ రాసుకోవడంపై బాధితుడి అనుమానం
  • ఐడీ కార్డులు చూపించాలంటూ అడగడంతో పోలీసుల దురుసు ప్రవర్తన
  • దర్యాప్తునకు ఆదేశించిన అనకాపల్లి ఎస్పీ.. వీఆర్‌కు నలుగురు కానిస్టేబుళ్లు
A soldier was attacked for questioning whether he was a policeman in Andhrapradesh

ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. ఫోన్‌లో దిశ యాప్ ఇన్‌స్టాల్ చేసే విషయమై జరిగిన ఈ గొడవ పరవాడ మండలం సంతబయలు వద్ద చోటుచేసుకుంది. బాధిత సైనికుడు సయ్యద్‌ అలీముల్లాతో తన ఫోన్‌లో దిశ యాప్ ఇన్‌స్టాల్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ఈ ప్రక్రియలో వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్‌ రాసుకోవడంతో అలీముల్లా అనుమానించాడు. దాంతో, మీరు పోలీసులేనా? అంటూ ప్రశ్నించి, వారిని ఐడీ కార్డు చూపించమంటూ అడిగాడు. దాంతో ఆగ్రహించిన పోలీసులు అలీముల్లాను కాలర్ పట్టుకొని లాగేయడంతో అతడు కిందపడ్డాడు. వెంటనే ఓ కానిస్టేబుల్ బూటు కాలితో అతడిని తన్నాడు. అంతలోనే ఒక మహిళా కానిస్టేబుల్ అతని దవడపై కొట్టింది. పోలీస్ స్టేషన్‌కు వస్తే అన్నీ చూపిస్తామంటూ దురుసుగా ప్రవర్తించారు. అలీముల్లాను పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అతడు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. బాధితుడు ఈ విషయాన్ని అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణకి ఫిర్యాదు చేశాడు. మంగళవారం పరవాడ సంతబయలు వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని వివరించాడు. అప్పటికే అక్కడున్న వారి ఫోన్లలో కానిస్టేబుళ్లు ఎం.ముత్యాలనాయుడు, శోభారాణి ‘దిశ యాప్‌’ ఇన్‌స్టాల్ చేయిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో ఎస్పీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్‌కు ఎటాచ్‌ చేశారు. ఇదిలావుండగా బాధితుడు అలీముల్లా అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలేనికి చెందినవాడు. జమ్మూకశ్మీర్‌ బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైఫిల్‌ క్యాంపులో సైనికుడిగా పనిచేస్తున్న అతడు ఈ నెల 2న సెలవుపై ఇంటికి వచ్చాడు.

Nationalist Voice

About Author

error: Content is protected !!