మీడియా..జవాబుదారీతనం

‘’…దేశంలో ప్రింట్‌ మీడియాకున్న జవాబుదారీతనం ఎలక్ట్రానిక్ మీడియాకు లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. సోషల్‌ మీడియా పరిస్థితి ఇంకా దారుణమని వ్యాఖ్యానించారు. కొత్త మీడియాకు ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మంచో, ఏది చెడో చెప్పే సామర్థ్యం లేదన్నారు. ఈ మీడియా స్వయంగా విచారణలు నిర్వహించి, అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవడానికి ఎంతో కష్టపడే అంశాలపై కూడా ఇట్టే వ్యాఖ్యానాలు చేస్తున్నాయని రమణ మండిపడ్డారు…’’

జస్టిస్ రమణ అన్న మాటలు నూటికి నూరుపాళ్లు నిజమే. డిజిటల్ మీడియాకు జవాబు దారీ తనం లేదు అనే అనుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలో ఇంకా డిజిటల్ మీడియా వ్యవహారాలను పర్యవేక్షంచే సరైన వ్యవస్థ ఏర్పడ లేదు కనుక. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం కేంద్రం చేస్తోంది. అందువల్ల భవిష్యత్ లో పరిస్థితి మారుతుందని అనుకోవచ్చేమో?

కానీ అంతకన్నా ముందుగా ప్రింట్ మీడియాకు వున్న జవాబుదారీ తనం ఏమిటో అన్నది కూడా ఆలోచించాలి. ప్రింట్ మీడియా అతి పురాతనమైనది. ప్రెస్ కౌన్సిల్ లాంటి సంస్థలు కొన్ని దానిని పర్యవేక్షించడానికి వున్నాయి. కానీ అలా అని చెప్పి ప్రింట్ మీడియా జవాబుదారీ తనానికి దూరంగా జరిగి చాలా కాలం అయిపోయింది. స్వయం నియంత్రణ అనే దానికి బదులు స్వయం నిర్ణయం అనే దిశగా వెళ్లిపోయింది. దాదాపు తొంభై శాతం ప్రింట్ మీడియా కు స్వంత రాజకీయ ఎజెండాలు వున్నాయి. అలా స్వంత రాజకీయ ఎజెండా వుండడం తప్పు కాదు. కానీ ఆ రాజకీయ ఎజెండా కోసం ఈ జవాబుదారీతనం అన్న కట్టుదాటి కథనాలు వండి వార్చడం అలవాటు చేసుకుని దశాబ్దాల కాలం దాటేసింది.

తమ తమ వ్యక్తిగత ఎజెండాల కోసం ఎదుటవారి మీద బురద జల్లే కథనాలు వండి వార్చే ప్రింట్ మీడియాకు జవాబుదారీ తనం ఏమేరకు వున్నట్లు? నిత్యం సింగిల్ పాయింట్ ఎజెండాతో తమకు నచ్చని వారిని ప్రజల్లో పలుచన చేయడమే లక్ష్యంగా సాగుతున్న ప్రింట్ మీడియా కు వున్న జవాబుదారీ తనం ఏమిటి?

ప్రెస్ కౌన్సిల్ లాంటి సంస్థలు కేవలం అలంకార ప్రాయంగా మారిపోతున్న కాలం ఇది. న్యాయ సూత్రాలు, చట్టాలు, సెక్షన్ల ఆనుపానులు అవగతం చేసుకుని, వాటి వేళ్ల సందుల్లోంచి జారిపోయే విధంగా కథనాలు వండి వార్చడం అన్నది అలవాటు చేసుకుని మరీ తమకు కిట్టని వారి మీద బురద జల్లడం అన్నది కార్యక్రమంగా మార్చుకుని ఏళ్లు గడిచిపోతోంది.

కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సమావేశాల మీద కూడా తమ ఎజెండాకు అనుగుణంగా కథనాలు వండి వార్చేస్తున్నారు. ప్రధానమంత్రి..ముఖ్యమంత్రి సమావేశం అయితే, ఆ ఇద్దరూ ఏం జరిగిందో ఎవరికి చెప్పరు అన్నది తెలసి కూడా, తమ చిత్తానికి వచ్చినట్లు ఊహాగానాలు జోడించి నమ్మకమైన కథనాలుగా మార్చేసి అందిస్తున్నారు. ఇదంతా జవాబుదారీ తనం ఎలా అవుతుంది?

గౌరవ ప్రధాన న్యాయమూర్తి డిజిటల్ మీడియాకు జవాబుదారీ తనం కావాలి అని కోరడం వరకు సబబే. కానీ అదే సమయంలో ప్రింట్ మీడియా కూడా జవాబుదారీ తనం కోల్పోతోందని కూడా అని వుంటే ఇంకా బాగుండేది.

అన్నింటికి మించి ఇవ్వాళ ప్రింట్ మీడియా-డిజిటల్ మీడియా అనేవి వేరు వేరుగా లేవు. అన్నీ కలిసిపోయాయి. ప్రింట్ మీడియాలు కూడా డిజిటల్ ఫార్మాట్ నే నమ్ముకుని ముందుకు సాగుతున్నాయి. ప్రింట్ మీడియాలో ఆదాయం పడిపోతే, దాన్ని డిజిటల్ ఫార్మాట్ లో వెదుక్కుంటున్నాయి. దాదాపు ప్రతి ప్రింట్ మీడియా..డిజిటల్ రంగంలోకి వచ్చేసింది.

ఇక్కడ బాధపడాల్సింది జవాబుదారీ తనం లేదని కాదు.…ఫార్మాట్ ఏదయినా ప్రతి మీడియా ప్రజా ప్రయోజనాలే ఎజెండా అనే ప్రధాన సూత్రం నుంచి తమ తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలే అసలు ఎజెండా అనే స్థాయికి చేరుకున్నాయన్న దాని గురించి. అది ఇప్పుడు బాధపడాల్సిన, ఆలోచించాల్సిన అసలు విషయం.

Nationalist Voice

About Author

error: Content is protected !!