​బెంబేలెత్తించిన బౌల్ట్… కివీస్ చేతిలో లంక ఘోర పరాజయం

  • సిడ్నీలో న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక
  • 65 పరుగుల తేడాతో గెలిచిన కివీస్
  • 168 పరుగుల ఛేదనలో లంక 102 ఆలౌట్
  • బౌల్ట్ కు 4 వికెట్లు
సిడ్నీలో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడింది. న్యూజిలాండ్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచ్ లో శ్రీలంక 65 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంకేయులు 19.2 ఓవర్లలో 102 పరుగులకే చాప చుట్టేశారు.

కివీస్ లెఫ్టార్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అద్భుత స్పెల్ తో లంక వెన్నువిరిచాడు. 4 ఓవర్లు విసిరిన బౌల్ట్ కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. బౌల్ట్ కు తోడు స్పిన్నర్లు మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ కూడా విజృంభించడంతో లంక స్వల్పస్కోరుకే కుప్పకూలింది. శాంట్నర్, ఇష్ సోధీ చెరో రెండు వికెట్లు తీసి కివీస్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. పేసర్లు టిమ్ సౌథీ, లాకీ ఫెర్గుసన్ చెరో వికెట్ తీశారు.

లంక ఇన్నింగ్స్ లో కెప్టెన్ దసున్ షనక 35 పరుగులు చేయగా, భానుక రాజపక్స 34 పరుగులు సాధించాడు. వీరిద్దరు తప్ప లంక ఇన్నింగ్స్ లో మరెవ్వరూ రెండంకెల స్కోరు నమోదు చేయలేకపోయారు.

అంతకుముందు, బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఓ దశలో 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఈ మాత్రం స్కోరు సాధించిందంటే అందుకు కారణం మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గ్లెన్ ఫిలిప్స్ ఇన్నింగ్సే.

గ్లెన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం విశేషం. 64 బంతులాడిన ఫిలిప్స్ 10 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేశాడు. లంక ఫీల్డర్లు పలుమార్లు క్యాచ్ లు వదిలేయడం ఫిలిప్స్ కు కలిసొచ్చింది. రెండుసార్లు లైఫ్ పొందిన ఫిలిప్స్ ఏకంగా సెంచరీ కొట్టి కివీస్ కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. కివీస్ ఇన్నింగ్స్ లో డారిల్ మిచెల్ 22 పరుగులు చేశాడు. ఫిలిప్స్ ను మొదట్లోనే అవుట్ చేసి ఉంటే లంక పరిస్థితి మరోలా ఉండేది. కానీ క్యాచ్ లు డ్రాప్ చేసి తగిన మూల్యం చెల్లించుకుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!