బాధితులకు బాసటగా..మేడ్చల్‌లో ‘భరోసా’ కేంద్రం

 

  • తొమ్మిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో సేవలు
  • నేడు ప్రారంభించనున్న డీజీపీ

మేడ్చల్‌ రూరల్‌, జూలై 25: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చిన్నారులు, మహిళలకు అండగా నిలుస్తున్న షీ టీమ్స్‌ ‘భరోసా’ కేంద్రం మేడ్చల్‌లో నేడు ప్రారంభం కానుంది. మేడ్చల్‌ కేంద్రంగా బాలానగర్‌ జోన్‌ పరిధిలోని శామీర్‌పేట, కూకట్‌పల్లి, మేడ్చల్‌, అల్వాల్‌, దుందిగల్‌, పేట్‌ బషీరాబాద్‌, జీడిమెట్ల, బాలానగర్‌, సనత్‌నగర్‌ తదితర తొమ్మిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేంద్రం సేవలందించనున్నది. మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్‌ క్వార్టర్స్‌ పక్కన నిర్మాణ పనులు పూర్తి చేసుకొని, ప్రారంభానికి సిద్ధమైంది.
అత్యాచారానికి గురైన మహిళలు, యువతులు, ఆకృత్యాలకు బలైన చిన్నారులకు షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం అండగా నిలుస్తున్నది. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధితులు, అత్యాచారాలకు గురైన మహిళలను అక్కున చేర్చుకుని, న్యాయ సహాయం చేస్తున్నది.

మంచి ఫలితాలిస్తున్న భరోసా కేంద్ర సేవలను బాధితులకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో పోలీస్‌ శాఖ జోన్ల వారీగా విస్తరిస్తున్నది. అందులో భాగంగా మొదటగా బాలానగర్‌ డీసీపీ జోన్‌ పరిధిలోని మేడ్చల్‌లో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇతర జోన్లలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నది.

భరోసా కేంద్రానికి వచ్చే వారికి త్వరితగతిన సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక ఎస్సైతో పాటు ఆరు విభాగాలు బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాయి. సెంటర్‌ హెడ్‌, వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి, రిసెప్షనిస్టు, అకౌంటెంట్‌ తదితల విభాగాలు ఉంటాయి. బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పని చేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారు. లీగల్‌, మెడికల్‌, చిన్నారుల కౌన్సెలింగ్‌ గదులు, స్టేట్‌మెంట్‌ రికార్డు, సమావేశ గదులు వేర్వేరుగా కేటాయించారు. సెక్షన్లు 161, 164 ప్రకారం బాధితుల స్టేట్‌మెంట్‌ను పోలీస్‌స్టేషన్‌, కోర్టుకు వెళ్లకుండా కేంద్రంలో నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

గతంలో బాధితులు భరోసా కేంద్రానికి వెళ్లాలంటే నగరానికి వెళ్లవలసి వచ్చేది. భరోసా కేంద్రం సమీపంలోకి రావడంతో సేవలు మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంటుంది.
మేడ్చల్‌లో భరోసా కేంద్రం మంగళవారం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డీజీపీ మహేందర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఆయనతో పాటు అడిషనల్‌ డీజీపీ స్వాతి లక్రా, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి, కలెక్టర్‌ హరీశ్‌ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం డీసీపీ సందీప్‌, ఏసీపీ రామలింగరాజు సీఐ రాజశేఖర్‌రెడ్డితో కలిసి భరో సా కేంద్రాన్ని పరిశీలించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సేవలు విస్తృతం
భరోసా కేంద్రం మేడ్చల్‌లో ఏర్పాటు కావడంతో సేవలు మరింత విస్తృతం అవుతాయి. కేంద్రం దగ్గరలో ఉండటంతో బాధితులకు సత్వర న్యాయం లభించనుంది. మంగళవారం కేంద్రం అధికారికంగా ప్రారంభం కావడంతో సేవలను ప్రారంభిస్తాం. బాధితులకు సహాయపడేందుకు కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేశాం.
– రాజశేఖర్‌ రెడ్డి, సీఐ మేడ్చల్‌

Nationalist Voice

About Author

error: Content is protected !!