ఫ్యాక్షనిస్టు నోట.. సోషలిస్టు మాటా?: యనమల

  • జగన్ పాలన మొత్తం బీసీలను అణచివేయడమేనన్న యనమల
  • విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో బీసీల సభను నిర్వహించడం ఏమిటని ఆగ్రహం
  • జగన్ దుర్మార్గాలకు బీసీలు సమాధి కట్టడం తథ్యమని వ్యాఖ్య
జగన్ రెడ్డి పాలన మొత్తం బీసీలను అణచివేయడమేనని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలోని బీసీలకు ఇక్కట్లు తప్ప మరేమీ లేవని అన్నారు. బీసీల ఆస్తులను దిగమింగుతున్న, బీసీలను బలి తీసుకుంటున్న విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో బీసీల సభను నిర్వహించడమే బీసీలకు జగన్ చేస్తున్న ద్రోహానికి నిదర్శనమని చెప్పారు. ఏపీఐఐసీ, టీటీడీ ఛైర్మన్, యూనివర్శిటీల వీసీలు, సలహాదారులు, ప్రభుత్వ న్యాయవాదులు సహా రాష్ట్రంలోని అన్ని కీలక నామినేటెడ్ పదవుల్లో తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను నియమిస్తే… ఇప్పుడు మొత్తం రెడ్లతో నింపారని విమర్శించారు.

టీడీపీ హయాంలో యూనివర్శిటీ వీసీలుగా బీసీలను నియమిస్తే జగన్ రెడ్డి వచ్చాక వారందరినీ బెదిరించి, రాజీనామాలు చేయించి సొంతవారిని నియమించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు రాష్ట్రాన్ని అప్పగించి బడుగు బలహీన వర్గాలపై పెత్తనం చేయించడం నిజం కాదా? ఇదేనా సామాజిక న్యాయం? ఇదేనా బీసీలకు న్యాయం చేయడం? అని మండిపడ్డారు.

తొలి నుంచి బీసీలంతా టీడీపీకి అండగా ఉన్నారని… అందుకే బీసీలపై వైసీపీ ప్రభుత్వం దాడులకు దిగుతోందని అన్నారు. రిజర్వేషన్లను కుట్రపూరితంగా కుదించి సుమారు 16,800 మంది బీసీలకు రాజకీయ అవకాశాలను దూరం చేశారని విమర్శించారు. జగన్ కుటుంబం ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు పెట్టింది పేరని అన్నారు. ఫ్యాక్షనిస్టు అయిన జగన్ సోషలిస్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫ్యాక్షనిస్టు నోట సోషలిస్టు మాటా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై జగన్ రెడ్డి మోసాలు, దుర్మార్గాలకు త్వరలోనే శుభం కార్డు వేసి.. నియంతృత్వానికి సమాధి కట్టడం తథ్యమని గుర్తుంచుకోవాలని అన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!