ప్రశ్నించే గొంతులు పెరుగుతాయి

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. కులమత సంకెళ్లలో చికుకుంటే దేశం పురోగమించజాలదని స్పష్టంచేశారు. దేశాభివృద్ధిలో కీలకమైనది మానవ వనరులని, అందులో ముఖ్యమైన యువతరం సెక్యులర్‌ భావాలతో ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఎప్పుడూ పుడుతుంటారని, ప్రస్తుతం తెలంగాణ ము ఖ్యమంత్రి కేసీఆర్‌ ఎదురు తిరిగారని, ఇక దేశమంతా ప్రశ్నించే గొంతులు పెరుగుతాయన్నారు.

బుధవారం హైదరాబాద్‌ గ్రోత్‌ క్యారిడార్‌ కేంద్ర కార్యాలయంలో ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ సంపాదకత్వంలో వెలువరించిన ‘చరిత్ర పుటల్లో తెలంగాణ’ గ్రంథాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ దూసుకుపోవాల్సిన సమయంలో కుల, మత చర్చల్లో కొట్టుకపోతే అది దేశానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచ చరిత్రలను అధ్యయనంచేస్తున్న విద్యార్థులు దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అవాంఛనీయ ఘటనలపై దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణ చరిత్రను, పోరాటాన్ని, జరిగిన ఉద్యమాలు, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్య మం, జాతరలు పండుగలు అనేకాంశాలను గ్రంథస్తం చేసిన ప్రొఫెసర్లను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, గ్రంథ రచయితలు ప్రొఫెసర్‌ జీ లక్ష్మణ్‌, ప్రొఫెసర్‌ మాదాడి వెంకటేశ్వరరావు, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!