ప్రముఖ నటుడు ప్రతాప్ పోతన్ ఇక లేరు!

ప్రతాప్ పోతన్ .. నిన్నటితరం ప్రేక్షకులకు ఈ పేరు బాగా తెలుసు. వైవిధ్యభరితమైన ఆయన నటన వాళ్లందరికీ ఇప్పటికీ గుర్తు. ప్రతాప్ పోతన్ తన కెరియర్ ఆరంభంలో హీరోగా చేసినప్పటికీ, ఆయన ఒక మంచి నటుడు అనే బాలచందర్ ప్రశంసించారు. కేవలం ఒకే ఒక స్మైల్ తోనే ఆయన తనలోని నిలనిజాన్ని బయటపట్టేవారు. కళ్లతోనే అద్భుతమైన హావభావాలు పలికించేవారు. చకచకా ఎక్స్ ప్రెషన్స్ మార్చే అరుదైన నటుల్లో ఆయన ఒకరుగా చెబుతారు.
కేరళ – తిరువనంతపురంలో 1951 ఆగస్టు 13వ తేదీన ఆయన జన్మించారు. 1978లో మలయాళ సినిమా ద్వారా నటుడిగా వెండితెరకి పరిచయమయ్యారు. ముందుగా మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ వెళ్లిన ఆయన, ఆ తరువాత కాలంలో తమిళంలో బిజీ అయ్యారు. అడపా దడపా తెలుగు తెరపై కూడా మెరిశారు. ‘ఆకలి రాజ్యం’ .. ‘కాంచనగంగ’ .. ‘జస్టీస్  చక్రవర్తి’ వంటి సినిమాలు తెలుగులో ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి.
హీరోగా .. విలన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా నాలుగు దశాబ్దాలుగా ఆయన తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కథ .. స్క్రీన్ ప్లే .. దర్శకత్వంపై కూడా ఆయనకి మంచి పట్టుంది. డజను సినిమాలకి ఆయన దర్శకత్వం వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ఆయన, నిన్న రాత్రి చెన్నై లోని తన ఫ్లాటులో మరణించారు. కార్డియాక్ అరెస్టుతో ఆయన తుది శ్వాస విడిచారు. దాంతో వివిధ భాషలకి చెందిన సినీ ప్రముఖులు … సన్నిహితులు .. అభిమానులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.  

Nationalist Voice

About Author

error: Content is protected !!