పోలీసు శాఖలో 6,511 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం: జగన్

  • పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామన్న జగన్
  • పోలీసు వ్యవస్థలో పలు సంస్కరణలను తీసుకొచ్చామని వ్యాఖ్య
  • పోలీసుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ
పోలీసు శాఖలో భారీ ఎత్తున నియామకాలను చేపట్టబోతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 6,511 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. హోం గార్డుల నియామకాల్లో రిజర్వేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… అమరవీరులకు, త్యాగధనులైన పోలీసు కుటుంబాలకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. గత సంవత్సర కాలంలో 11 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు. సమాజం కోసం ప్రాణాలను అర్పించిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థలో పలు సంస్కరణలను తీసుకొచ్చామని జగన్ చెప్పారు. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఇందులో భాగమేనని తెలిపారు. ఇప్పటి వరకు 1.33 కోట్ల మంది దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు. పోలీస్ శాఖలో 16 వేల మంది మహిళా పోలీసులను నియమించామని తెలిపారు. దళిత మహిళను హోం మంత్రిగా నియమించామని చెప్పారు. అణగారిన వర్గాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలనేది తన ఉద్దేశమని… అయితే, సిబ్బంది కొరత వల్ల అది అమలు కావడం లేదని జగన్ తెలిపారు. అందుకే పోలీసు శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని చెప్పారు. పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!