పవన్ కల్యాణ్ హత్యాయత్నానికి పాల్పడ్డారు… చెప్పులను గుట్టగా పోసి నిరసన తెలిపిన భూమన

  • తుడా సర్కిల్ లో వైఎస్సార్ విగ్రహం వద్ద భూమన నిరసన
  • తన వ్యాఖ్యలతో పవన్ హత్యానేరానికి పాల్పడ్దారన్న వైసీపీ ఎమ్మెల్యే
  • పవన్, చంద్రబాబుల భేటీ ముందస్తుగా ప్లాన్ చేసుకున్నదేనని ఆరోపణ
  • భేటీ ద్వారా పవన్, చంద్రబాబులు తమ నగ్నత్వాన్ని బయటపెట్టుకున్నారని ధ్వజం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరణాకర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. తిరుపతిలోని తుడా సర్కిల్ లో వైఎస్సార్ విగ్రహం వద్ద వైసీపీ నేతలతో కలిసి బుధవారం భూమన నిరసనకు దిగారు. ఈ సందర్భంగా చెప్పులను గుట్టగా పోసి… దాని ముందు కూర్చుని భూమన నిరసన చేపట్టారు. ఈ నిరసనలో తిరుపతి మేయర్ తో పాటు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఏకంగా సీఎం జగన్ ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రమైన నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని భూమన అన్నారు. పవన్ తన వ్యాఖ్యలతో ఏకంగా 3 నేరాలకు పాల్పడ్డారని కూడా ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులను చెప్పుతో కొడతానని వ్యాఖ్యానించడం ద్వారా పవన్ హత్యాయత్నానికి పాల్పడ్డట్టేనన్నారు. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే… ఇక ఆయన పార్టీ శ్రేణులు ఇంకెంత రెచ్చిపోతాయోనని భూమన ఆందోళన వ్యక్తం చేశారు.

పవన్ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భేటీ కావడాన్ని కూడా భూమన తప్పుబట్టారు. ఈ భేటీ అప్పటికప్పుడు నిర్ణయించుకున్నది కాదని, జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు తన కార్యక్రమాలను చాలా ముందుగానే భద్రతా సిబ్బందికి చెప్పాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో పవన్, చంద్రబాబు ముందుగా నిర్ణయించుకున్న మేరకే కలిశారని ఆరోపించారు. ఈ భేటీ ద్వారా పవన్, చంద్రబాబులు తమ నగ్నత్వాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఈ తరహా ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అదుపు చేసేందుకు తమ ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని కూడా భూమన తెలిపారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!