పవన్ కల్యాణ్ ఎఫెక్ట్.. ఢిల్లీకి వెళ్లిన సోము వీర్రాజు

  • బీజేపీతో కలిసి ప్రయాణం చేయలేమని పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన పవన్
  • చంద్రబాబు, పవన్ ల భేటీతో ఏపీలో మారిన రాజకీయ ముఖచిత్రం
  • తాజా రాజకీయ పరిణామాలను బీజేపీ పెద్దలకు వివరించనున్న వీర్రాజు
ఇంతకాలం బీజేపీ – జనసేనల మధ్య ఉన్న పొత్తు ముగింపు దశకు చేరుకుంది. బీజేపీ పట్ల తనకు వ్యతిరేకత లేదని… అయితే, ఊడిగం చేయలేమని నిన్న పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో కలిసి పని చేయడానికి రూట్ మ్యాప్ అడిగామని… కాలం గడిచిపోతున్నా వాళ్లు రూట్ మ్యాప్ ఇవ్వలేక పోయారని… ప్రజలను కాపాడుకోడానికి వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోందని అన్నారు. అయితే, అంతకు ముందే విజయవాడలోని నొవోటెల్ హోటల్ లో పవన్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. ఇకపై బీజేపీతో కలిసి పని చేయలేమనే విషయాన్ని ఈ సందర్భంగా వీర్రాజుకు పవన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఉన్నప్పటికీ ఇరు పార్టీలు కలిసికట్టుగా ప్రయాణం సాగించలేదనే చెప్పుకోవచ్చు. ఒక్క అమరావతి అంశం మినహా రెండు పార్టీలు కలిసి పని చేయలేదు. పైగా, తమ రాజకీయ అవసరాల కోసం వైసీపీని కేంద్రంలోని బీజేపీ సర్కారు వాడుకుంటోందనే భావన అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో, బీజేపీ నుంచి తమకు సరైన సహకారం లేదనే తుది నిర్ణయానికి వచ్చిన పవన్ కల్యాణ్… బీజేపీ కలిసి ప్రయాణం చేయలేమనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. మరోవైపు దాదాపు ఐదేళ్ల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కలవడం… రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన మధ్య మళ్లీ పొత్తు పొడవబోతోందనే సంకేతాలను ఇస్తోంది.

మారిన ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోము వీర్రాజు ఈరోజు హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలను బీజేపీ పెద్దలకు వివరించనున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!