పట్టాలు తప్పిన బోగీలను ఈడ్చుకెళ్లిన గూడ్స్ రైలు.. బెంబేలెత్తిన జనం

  • బొగ్గులోడుతో వెళ్తూ పట్టాలు తప్పి గూడ్స్ రైలు
  • 58 వ్యాగన్లలో 53 బోగీలు పట్టాలు తప్పిన వైనం
  • ట్రాక్ వెంబడి చెల్లాచెదురుగా పడిన వ్యాగన్లు
బీహార్‌లో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 53 వ్యాగన్లు చెల్లాచెదురయ్యాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. 58 వ్యాగన్లతో బొగ్గు లోడుతో ధన్‌బాద్ డివిజన్‌లోని గయ-కోడెర్మా మార్గంలో ప్రయాణిస్తున్న రైలు గుర్పా రైల్వే స్టేషన్‌లో నిన్న తెల్లవారుజామున 6.24 గంటలకు పట్టాలు తప్పింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పిన వ్యాగన్లను రైలు ఈడ్చుకుపోయింది. వ్యాగన్లు ట్రాక్ వెంబడి చెల్లాచెదురుగా పడ్డాయి.

పట్టాలు తప్పిన వ్యాగన్లను పెద్ద శబ్దంతో రైలు ఈడ్చుకుపోతుండడాన్ని చూసి జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు వ్యాగన్లు తొలగించి, ట్రాకుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్లకు అంతరాయం కలిగినట్టు ఈస్ట్‌కోస్ట్ రైల్వే తెలిపింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!