పక్కా ప్లాన్ తోనే నా కాన్వాయ్ పై దాడి చేశారు: ఈటల రాజేందర్

  • పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ సమక్షంలోనే దాడులు జరిగాయన్న ఈటల
  • దాడికి పోలీసులు బాధ్యత వహించాలని డిమాండ్
  • మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనిపిస్తారని వ్యాఖ్య
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై పలివెలలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో గెలవలేమనే భయంతోనే తమపై టీఆర్ఎస్ వాళ్లు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ సమక్షంలోనే ఈ దాడులు చేశారని చెప్పారు.

అయినా మునుగోడులో ప్రజలు ఇచ్చే తీర్పుతో టీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనడం ఖాయమని అన్నారు. పలివెలలో టీఆర్ఎస్ కు క్యాడర్ కూడా లేదని… ఇలాంటి చోట పోలీసులను కూడా లెక్క చేయకుండా వాళ్లు దాడులు చేయడాన్ని అందరూ గమనించాలని చెప్పారు. తమను ఎదుర్కోలేకే ఇలా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.

కిషన్ రెడ్డి ప్రచారం చేసినప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారని ఈటల మండిపడ్డారు. ఇలాంటి చిల్లర వేషాలు టీఆర్ఎస్ కు కొత్తేమీ కాదని విమర్శించారు. పలివెలలో పక్కా ప్లాన్ తోనే దాడి చేశారని అన్నారు. టీఆర్ఎస్ వాళ్లు చేసిన దాడిలో 15 ప్రచార రథాలు, వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. కేసీఆర్ గూండాయిజానికి భయపడేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి పోలీసులు బాధ్యత వహించాలని అన్నారు. పోలీసులు బాధ్యత వహించకపోతే ముఖ్యమంత్రి కూడా మిమ్మల్ని కాపాడలేరని హెచ్చరించారు. మరోవైపు ఈ ఘటనలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలకు చెందిన వాళ్లు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!