న్యాయ వ్యవస్థ కేవలం రాజ్యాంగానికే జవాబుదారీ: జస్టిస్​ ఎన్​ వీ రమణ

దేశంలో న్యాయ వ్యవస్థ ఎవరికీ లోబడి ఉండదని.. అది కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను న్యాయ వ్యవస్థ సమర్థించాలని భావిస్తాయని.. ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు తాము రాజకీయంగా ముందుకెళ్లేందుకు న్యాయ వ్యవస్థ పనికి వస్తుందని భావిస్తాయని.. కానీ న్యాయ వ్యవస్థ కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఎన్నారైల అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు.
రాజ్యాంగం స్ఫూర్తిని ఇంకా గుర్తించడం లేదు
‘‘భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయింది. గణతంత్ర దేశంగా మారి 72 సంవత్సరాలు పూర్తయింది. కానీ దేశంలోని వివిధ విభాగాలకు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలు, ఆయా విభాగాలు పోషించాల్సిన పాత్రపై మనం ఇప్పటికీ సరిగా గుర్తించడం లేదని నా అభిప్రాయం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని న్యాయ వ్యవస్థ సమర్థించాలని అధికారంలో ఉన్న పార్టీ భావిస్తుంది. ప్రతిపక్షాలు తాము రాజకీయంగా ముందుకెళ్లేందుకు న్యాయ వ్యవస్థ సహకరించాలని భావిస్తుంటాయి. ఇలాంటి లోపభూయిష్టమైన ఆలోచనలు ప్రజలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరును సరిగా అర్థం చేసుకోలేకపోవడానికి కారణమవుతున్నాయి..” అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

వ్యవస్థలో బాధ్యతలపై అవగాహన పెంచాలి
న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే శక్తులు.. న్యాయ వ్యవస్థ పట్ల సాధారణ ప్రజల్లో నిర్లక్ష్యాన్ని పెంచుతున్నాయని జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు. తాము కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ అని స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగ పరమైన సంస్కృతిని పెంచాల్సి ఉందని, వ్యవస్థలో ఎవరి బాధ్యత ఏమిటన్నదానిపై అవగాహనను కల్పించాల్సి ఉందని స్పష్టం చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!