నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్‌ ఫోకస్.. నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

నేషనలిస్ట్ వాయిస్, మే 19. హైదరాబాద్  : నేషనల్ పాలిటిక్స్‌పై మరోసారి గులాబీ బాస్‌ కేసీఆర్‌ గురిపెట్టారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు మళ్లీ తన కార్యాచరణను మొదలుపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేషనల్‌ పాలిటిక్స్‌లో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌లు, పార్టీలు అవసరం లేదన్న ఆయన.. ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమనే నిర్ణయానికి వచ్చారు. జాతీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతున్న సీఎం.. ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా సిద్ధం చేసే పనిలో పడ్డారు. అందుకోసం నేడు ఢిల్లీకి వెళ్లి.. పలు రాజకీయ పార్టీ నేతలు, సెంట్రల్ ఉద్యోగ సంఘాలతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఇటు కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చాక.. నాటి రాజీవ్‌గాంధీ నుంచి నేటి మోదీ వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రం నుంచే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారంగా ఉందన్నారు. జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, ప్రధాని గ్రామసడక్‌ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సరికాదన్నారు. స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని సీఎం అన్నారు. కానీ రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. 75 ఏళ్ల ఆజాదీకి అమృత్‌ మహోత్సవాలు జరుపుకొంటున్న సమయంలో కూడా.. దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయని, తాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారని.. కేంద్రం తీరే దీనికి కారణమని కేసీఆర్‌ విమర్శించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!