నేను ముందే చెప్పాను.. బీజేపీ ఒక్కో ఎమ్మెల్యేను రూ. 100 కోట్లకు కొనుగోలు చేస్తుందని: కేఏ పాల్

  • ఎమ్మెల్యేల బేరసారాలకు రఘునందనరావు, కిషన్ రెడ్డే మధ్యవర్తులన్న పాల్
  • బీజేపీ నుంచి దేశాన్ని, టీఆర్ఎస్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుందామని పిలుపు
  • ఆ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి
టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బు, కాంట్రాక్టులు, పదవుల ఆశ చూపి ప్రలోభాలకు గురిచేసిన ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ సంతలో పశువులను కొన్నట్టు కొంటోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మధ్యవర్తులుగా వ్యవహరించారని అన్నారు. మహారాష్ట్రలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టుగానే, ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేస్తుందని తాను ముందే చెప్పానని అన్నారు. సైబరాబాద్ పోలీసులు రూ. 15 కోట్లు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.

టీఆర్ఎస్ కూడా తక్కువదేమీ కాదని, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మునుగోడులో ఓటర్లను కొనుగోలు చేస్తోందన్నారు. కాబట్టి అవినీతికి పాల్పడుతున్న టీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేయొద్దని, ఉంగరం గుర్తుపై ఓటువేసి తనను గెలిపించాలని కోరారు. ఆ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతిని అంతం చేసి అభివృద్ధి చేసుకుందామని అన్నారు. బీజేపీ బారి నుంచి దేశాన్ని, టీఆర్ఎస్ బారి నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుందామని పేర్కొన్నారు. కాంగ్రెస్ మిత్రులు కూడా తనకే ఓటు వేసి గెలిపించాలని పాల్ విజ్ఞప్తి చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!