నేను కనిపించేంత కామ్ కాదు: నటి ప్రగతి

  • ఒకప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి
  • ఇప్పుడు తల్లి పాత్రలతో బిజీ
  • హీరోయిన్ గా అందుకే చేయలేదంటూ వివరణ
  • తనకి కూడా కోపం వస్తుందంటూ వ్యాఖ్య
అందమైన అమ్మ పాత్రలలో ప్రగతి మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి, ఆ తరువాత కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. సీనియర్ స్టార్ హీరోయిన్స్ అమ్మ పాత్రలు పోషిస్తున్నప్పటికీ, వాళ్లకి గట్టి పోటీ ఇస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ లో ఆమె మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

“నేను పుట్టి పెరిగింది హైదరాబాదులోనే అయినప్పటికీ, ఆ తరువాత కొన్ని కారణాల వలన చెన్నై కి వెళ్లవలసి వచ్చింది. చెన్నై లో నేను డిగ్రీ ఫస్టు ఇయర్ చదువుతూ ఉండగా, ‘రోజా’ సినిమా విడుదలైంది. దాంతో నేను ‘మధుబాల’ మాదిరిగా ఉంటానని అంతా అనేవారు. ఆ సమయంలోనే సీనియర్ నటి సీఆర్ సరస్వతిగారు నన్ను చూడటం .. నా గురించి భాగ్యరాజా గారికి ఆమె చెప్పడం .. ఆయన నన్ను హీరోయిన్ గా తీసుకోవడం జరిగిపోయింది. అయితే అప్పట్లో కొత్తగా వచ్చిన హీరోయిన్స్ కి అంత విలువ ఉండేది కాదు.

కొంతమంది ప్రవర్తన నాకు చాలా ఇబ్బందిని .. బాధను కలిగించింది. దాంతో నేను హీరోయిన్ గా చేయడం మానుకున్నాను. ఆ తరువాత కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాను. ఒకప్పటిలా నేను ఇప్పుడు అంత సైలెంట్ కాదు. నన్ను చూసిన చాలామంది అసలు మీకు కోపం వస్తుందా’ అని అడుగుతుంటారు. సందర్భాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతుంటాను. నేను కనిపించేంత కామ్ కాదు .. నా నోరు చాలా పెద్దదని మా అమ్మే అంటూ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!