నీరసంగా, అలసిపోయినట్టుగా అనిపిస్తోందా..?

బోరింగ్ గా, నీరసంగా, అలసిపోయినట్టుగా అనిపిస్తుంటే.. మీ జీవనశైలిని ఓసారి చెక్ చేసుకోవాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నేటి రోజుల్లో ఎక్కువ మంది నుంచి వినిపించే సమస్యే ఇది. దీనికి పలు కారణాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. నిద్ర, ఆహారం, శారీరక కదలికలు సరిగ్గా లేనప్పుడు కనిపించే దుష్ప్రభావాలుగా వీటిని పేర్కొంటున్నారు. దీనికి పరిష్కారం కావాలని కోరుకునే వారికి జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులను సూచిస్తున్నారు.
నిద్ర
మన శరీరం మొత్తం నిద్రలోనే తాజాదనాన్ని సంతరించుకుంటుంది. నాణ్యమైన నిద్ర పోయినప్పుడే ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందని గుర్తించాలి. మన చుట్టూ ఉన్న వారిని ఒక్కసారి గమనించాలి. అందులో కొందరు ఎప్పుడూ ఉత్సాహంగా, చురుగ్గా, సానుకూలంగా వ్యవహరించడం కనిపిస్తుంది. ఎందుకని? సరైన పోషకాహారంతోపాటు, నాణ్యమైన నిద్రపోవడం వల్లే. త్వరగా అలసిపోయినట్టు, రోజులో ఎక్కువ సమయం అలసిపోయినట్టు అనిపిస్తుంటే తగినంత నిద్ర లేదని అర్థం.

రోజులో కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. నిద్ర లేమి ప్రభావం మానసిక స్థితి, జ్ఞాపకశక్తి మరియు కాగ్నిటివ్ పనితీరును ప్రభావితం చేస్తుంది. అందుకని తగినంత సమయం నిద్రకు అవసరం. అది కూడా నాణ్యమైన నిద్ర కావాలి. శారీరక శ్రమ, ధ్యానం, యోగా, ప్రాణాయామం ద్వారా నిద్ర నాణ్యతను పెంచుకోవచ్చు.శక్తికి కావాల్సినవి..
అలసిపోయినట్టు అనిపించడం వెనుక పోషకాల లోపం కూడా కారణం కావచ్చు. మీరు తీసుకునే పోషకాలు మీ శక్తిని నిర్ణయిస్తాయి. కండరాలు, నరాల పనితీరు, రక్తంలో గ్లూకోజు నియంత్రణ, శక్తి తయారీకి మెగ్నీషియం కీలకం. అరటి పండ్లు, గుమ్మడి గింజల్లో ఇది లభిస్తుంది.

ముడి ధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, మాంసం, పాలు, గుడ్లలో లభించే బీ విటమిన్ కూడా కీలకం. శరీరానికి శక్తిని ఇవ్వడంలో బీ విటమిన్ల పాత్ర పెద్దదే. 
మన కండరాలు సరిగ్గా పనిచేసేందుకు, శక్తిని పెంచడంలో విటమిన్ డీ ఎంతో సాయపడుతుంది. కనుక విటమిన్ డీ లోపం లేకుండా చూసుకోవాలి. పాల ఉత్పత్తులు, సూర్యరశ్మి ద్వారానే విటమిన్ డీ లభిస్తుంది.
శరీరంలో రక్త పరిమాణం తగ్గినా కానీ అలసట, నీరసం అనిపిస్తాయి. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు శరీరంలోని కణాలు అన్నింటికీ ఆక్సిజన్ చేరవేస్తాయి. ఇందుకు ఐరన్ చాలా అవసరం. వేరు శనగలు, తోటకూరలో ఇది తగినంత లభిస్తుంది.
శారీరక వ్యాయామం
అలసటను అధిగమించి, శరీరం శక్తిదనం సంతరించుకోవడానికి వ్యాయామాలు కూడా ముఖ్యమే. ఎందుకంటే వ్యాయామాలతో మెదడులో డోపమైన్ స్థాయులు పెరుగుతాయి. ఇది మంచి మూడ్ కు దారితీస్తుంది. మీ శరీరానికి అనుకూలమైన వ్యాయామాల్లో, మీకు నచ్చినది ఎంపిక చేసుకోవాలి. అప్పుడే ఉత్సాహంగా చేయగలరు.

మెడిటేషన్
ప్రాణాయామం మానసిక శక్తిని పెంపొందిస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. అప్పుడు సానుకూల భావనలకు వీలు కలుగుతుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!