నిరుపేద ఎమ్మెల్యేకు ప్రభుత్వ ఇల్లు.. కలలో కూడా సొంతమైతదని ఊహించలేదన్న ఎమ్మెల్యే

  • ఇంటి తాళాలు అందుకున్న తర్వాత కన్నీటిపర్యంతం
  • తొలిసారి శాసన సభకు ఎన్నికైన రామ్ వృక్ష్ సదా
  • ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సదా ఆస్తిపాస్తులు రూ. లక్ష మాత్రమే
ప్రభుత్వ పథకంలో భాగంగా ఇళ్లొచ్చింది.. ఇంటి తాళాలు అందుకున్నాక ఆనందం పట్టలేక ఏడ్చేశాడాయన. ఆనంద భాష్పాలతో ఇలాంటి ఇళ్లును సొంతం చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన నిజమైన ఏ లబ్దిదారుడైనా ఇలాగే స్పందిస్తాడు ఇందులో విశేషం ఏముందని అనిపిస్తోంది కదా! ఇదికూడా చెప్పుకోదగ్గ విశేషమే.. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేసింది సామాన్యుడు కాదు, సాక్షాత్తూ బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుడు. ఆయనే ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్ వృక్ష్ సదా. బీహార్ లోని ఎమ్మెల్యేలలో నిరుపేద ఎమ్మెల్యే ఈయనే! సదా ఆస్తులు మొత్తం లక్ష( రూ.75 వేల విలువైన స్థిరాస్తులు, రూ.25 వేల నగదు) మాత్రమే.

ఖగరియా జిల్లాలోని అలౌలీ నియోజకవర్గం నుంచి సదా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జిల్లాలోని రౌన్ అనే గ్రామంలో రెండు బెడ్రూంల ఇంట్లో సదా కుటుంబం ఉంటోంది. ఈ ఇంటిని కూడా 2004లో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద నిర్మించుకున్నట్లు సదా చెప్పారు. ఇందులో ఐదుగురు కొడుకులు, ఒక కూతురుతో కలిసి ఉంటున్నట్లు వివరించారు. అయితే, ప్రజాప్రతినిధుల కోసం చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టులో ప్రభుత్వం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఇళ్లు కేటాయించింది. పాట్నాలో మూడు అంతస్థులతో నిర్మించిన ఈ భవనాలు పొందిన వాళ్లలో సదా కూడా ఉన్నారు. ఈ ఇంటికి సంబంధించిన తాళాలను సదా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సదా భావోద్వేగానికి గురయ్యారు. ఏదైనా విలువైనది దొరికినప్పుడే పేదవాడికి నిజమైన దీపావళి అని సదా వ్యాఖ్యానించారు. ఇప్పుడు తనకూ అలాగే ఉందని చెప్పారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!