నితీష్ కుమార్ బీజేపీతో టచ్​ లోనే ఉన్నారంటూ పీకే సంచలన ఆరోపణలు

  • అవసరమైతే మళ్లీ  బీజేపీతో జట్టు కడుతారని ప్రశాంత్ కిషోర్ విమర్శ
  • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాజీనామా కోరకపోవడమే అందుకు కారణం అని వ్యాఖ్య
  • ప్రశాంత్ కిషోర్ ఆరోపణలను ఖండించిన జేడీయూ

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) సంచలన ఆరోపణలు చేశారు. ఈ మధ్యే ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న నితీష్.. ఇంకా బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. అవసరం అయితే ఆ పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకుంటారని చెప్పారు. జేడీయూ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ ద్వారా బీజేపీతో నితీష్  సంబంధాలను కొనసాగిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమిని ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. కానీ, బీజేపీతో స్నేహానికి నితీష్ తలుపులు తెరిచే ఉంచారని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయన తన పార్టీ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ ద్వారా బీజేపీతో టచ్‌లో ఉన్నారు. బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకున్నప్పటికీ హరివంశ్‌ ను రాజ్యసభ పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరకపోవడానికి ఇదే కారణం. పరిస్థితులు మారితే ఆయన మళ్లీ బీజేపీతో కలిసి పనిచేయగలరన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

అయితే, పీకే వ్యాఖ్యలపై స్పందించేందుకు హరివంశ్ నిరాకరించగా, జేడీయూ మాత్రం వీటిని ఖండించింది. నితీష్ ఇంకెప్పుడూ బీజేపీతో చేతులు కలపరని జేడీయూ నేతలు స్పష్టం చేశారు. ‘ప్రశాంత్ కిషోర్ వాదనలను ఖండిస్తున్నాము. నితీష్ 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి ఆరు నెలలే అవుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించి, గందరగోళాన్ని సృష్టించడానికే ఆయన ఈ వ్యాఖ్య చేశారు’ అని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!