నా షోకు పవన్ కల్యాణ్ కచ్చితంగా వస్తారు: అలీ

  • ‘అలీతో సరదాగా’ షోకి వస్తానని పవన్ తనతో చెప్పారన్న అలీ
  • ప్రస్తుతం పవన్ చాలా బిజీగా ఉన్నారని వ్యాఖ్య
  • ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’లు సీరియస్ సినిమాలు కావడం వల్లే తాను నటించలేదని వెల్లడి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సినీ నటుడు వైసీపీ నేత అలీకి మంచి స్నేహం ఉంది. అయితే అలీ వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. పవన్ ప్రతి సినిమాలోనూ దాదాపుగా అలీ ఉంటారు. అయితే, పవన్ గత రెండు చిత్రాల్లో ఆయన కనపడలేదు. మరోవైపు ఓ సినిమా ప్రమోషన్ లో అలీ మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

పవన్ తాజా చిత్రాలైన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలు చాలా సీరియస్ చిత్రాలని… అందులో కామెడీ లేదని, అందుకే వాటిలో తాను నటించలేదని చెప్పారు. ఆ చిత్రాల్లో తానే కాదు, ఏ కమెడియన్ కూడా లేరని అన్నారు. పవన్ సినిమాల్లో కామెడీ ఉంటే తనను కచ్చితంగా పిలుస్తారని చెప్పారు. తన ‘అలీతో సరదాగా’ టీవీ షోకి పవన్ కల్యాణ్ కచ్చితంగా వస్తారని తెలిపారు. తన షోకు వస్తానని ఆయన తనతో చెప్పడం కూడా జరిగిందని… అయితే, ప్రస్తుతం ఆయన చాలా బిజీగా ఉన్నారని చెప్పారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!