నా ఆరోగ్యంపై ఎంత క్రియేటివ్ గా ప్రచారం చేశారో!: విక్రమ్ వ్యంగ్యం

దక్షిణాది స్టార్ హీరో విక్రమ్ (56) ఇటీవల ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. అయితే, విక్రమ్ కు గుండెపోటు అంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై అప్పుడే విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ ఖండించారు. తాజాగా, విక్రమ్ కూడా స్పందించారు.ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని వెల్లడించారు. తాను ఆసుపత్రిలో చేరింది గుండెపోటుతో కాదని స్పష్టం చేశారు. ఛాతీలో ఇబ్బందికరంగా అనిపించడంతో చికిత్స పొందానని, కానీ మీడియాలోని కొన్ని వర్గాలు ఊహాగానాలు ప్రచారం చేశాయని ఆరోపించారు. సోషల్ మీడియాలోనూ కొంతమంది ఎంతో ‘క్రియేటివ్’ గా తన ఆరోగ్యంపై ప్రచారం చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు.అభిమానులు తన వెంట ఉన్నంత కాలం తనకేమీ కాదని విక్రమ్ వ్యాఖ్యానించారు. నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఉండగా నాకేం భయం అంటూ పేర్కొన్నారు. తన కొత్త చిత్రం ‘కోబ్రా’ ఆడియో ఫంక్షన్ లో విక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!