నాలుగో అంతస్తు నుంచి పడి చిన్నారి దుర్మరణం

  • రెండు కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణం
  • నాన్న కోసం వచ్చానంటూ.. నాలుగో అంతస్తు పైకి ఎక్కిన చిన్నారి
  • బాలిక మృతిపై అనుమానాలు
  • బలవంతంగా తీసుకెళ్లారా.. అనే కోణంలో విచారణ

  మన్సూరాబాద్‌ : నాన్న కోసం వచ్చానంటూ.. గబాగబా బిల్డింగ్‌పైకి ఎక్కి నాలుగో అంతస్తు నుంచి దూకి 11 ఏండ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటన ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, వనిపాకల గ్రామానికి చెందిన ఏల్ల సత్యనారాయణ రెడ్డి రైతు. సత్యనారాయణ రెడ్డికి భార్యా ప్రభావతి, ముగ్గురు కూతుళ్లు రితిక, వర్షిత (11), లాత్విక ఉన్నారు.

  పిల్లల చదువుల దృష్ట్యా భార్య ప్రభావతి, ముగ్గురు కూతుళ్లు ప్రస్తుతం మన్సూరాబాద్‌లోని మధురానగర్‌ కాలనీ రోడ్డునం. 5లో ఉంటున్నారు. ప్రభావతి ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నది. సత్యనారాయణ రెడ్డి తనకు ఖాళీగా ఉన్న సమయంలో ఊరి నుంచి మధురానగర్‌కు వచ్చి భార్యా, పిల్లలతో కలిసి ఉంటాడు. ఇదిలాఉండగా.. రెండో కూతురు వర్షిత మన్సూరాబాద్‌లోని శ్రీచైతన్య స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నది. మంగళవారం సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చిన వర్షిత సుమారు 5:30 గంటల సమయంలో చిప్స్‌ కొనుకుంటానంటూ తల్లి వద్ద రూ. 20 తీసుకుని దుకాణానికి వెళ్లింది. దుకాణానికి వెళ్లిన వర్షిత ఎంతకీ తిరిగి రాకపోవడంతో కాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లో వెతకడం ఆరంభించారు.

  చిప్స్‌ కోసమంటూ వెళ్లి.. ఆటో ఎక్కిన చిన్నారి
  చిప్స్‌ కోసమంటూ ఇంటి నుంచి బయలుదేరిన వర్షిత మన్సూరాబాద్‌ చౌరస్తాకు వచ్చి ఆటో ఎక్కింది. చంద్రపురికాలనీ రోడ్డునం. 2/బీ కు వెళ్లాలంటూ ఆటోను రూ. 50కు మాట్లాడుకుని బయలుదేరింది. సాయంత్రం 6:15 గంటలకు చంద్రపురికాలనీకి చేరుకున్న వర్షిత గబాగబా బిల్డింగ్‌పైకి వెళ్తుండగా.. అక్కడ పని చేస్తున్న వాచ్‌మన్‌ వెంకటమ్మ ఎవరు కావాలని అడిగింది. మా నాన్న కోసం వచ్చానంటూ చెప్పగా.. ఇక్కడ ఎవరూ ఉండరూ.. అని చెబుతుండగానే బిల్డింగ్‌పైకి వెళ్లింది. వాచ్‌మన్‌ తన కుమారుడైన రాజును బిల్డింగ్‌పైకి పంపగా ఎవరూ కనిపించలేదు. ఇంతలోనే వర్షిత నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది. వెంట నే ఆమెను చింతలకుంటలోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

  ఆ బిల్డింగ్‌కు ఎందుకు వచ్చినట్లు.?
  చిన్నారి వర్షిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధురానగర్‌కాలనీ నుంచి చంద్రపురికాలనీకి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటో తీసుకుని సదరు బిల్డింగ్‌ వద్దకు ఎందుకు వచ్చింది.. అనేది మిస్టరీగా మారింది. మా నాన్న కోసం వచ్చానంటూ చెప్పి.. బిల్డింగ్‌ పై నుంచి దూకాల్సిన అవసరం పదకొండేళ్ల చిన్నారికి ఎందుకు వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులకు అక్కడ బంధువులు కూడా లేరు.. గతంలో సదరు బాలిక ఇక్కడకు వచ్చిన దాఖలాలు కూడా లేవు.. అని పోలీసులు చెబుతున్నారు. ఆటోలో ఎవరైనా అక్కడికి బలవంతంగా తీసుకువచ్చారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్‌..
  మన్సూరాబాద్‌ నుంచి చంద్రపురికాలనీకి సదరు బాలిక ప్రయాణించిన ఆటో డ్రైవర్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆటోలో ఉండగా.. తన తండ్రికి ఫోన్‌ చేయాలంటూ ఆటో డ్రైవర్‌ వద్ద ఫోన్‌ తీసుకున్నది. తండ్రికి కాల్‌ చేయగా సమాధానం రాలేదు. చిన్నారిని దించి ఆటో డ్రైవర్‌ కొంత దూరం వెళ్లాడు. తిరిగి ఆటో డ్రైవర్‌ చంద్రపురికాలనీ రోడ్డునం. 2కు చేరుకోగా అప్పటికే బాలిక బిల్డింగ్‌ పై నుంచి దూకింది. విషయాన్ని ఆటో డ్రైవర్‌ పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం పోలీసులు అతడి నుంచి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్‌ చెబుతున్నవి నిజాలేనా.. అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!