ద్రవిడ్​ ఇలా అరవడం ఎప్పుడైనా చూశారా.. వీడియో ఇదిగో

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తొలి రోజు ఏడు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ ఓ దశలో 200 ల్లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, తొలి రోజే భారత జట్టు పటిష్ఠ స్థితికి చేరుకోవడంలో ప్రధాన పాత్ర యువ బ్యాటర్ రిషబ్ పంత్ దే. 

భారత క్రికెట్ లో తానెంత విలువైన ఆటగాడినో నిరూపిస్తూ పంత్.. ఎడ్జ్ బాస్టర్ గ్రౌండ్లో అద్భుత బ్యాటింగ్ తో అలరించాడు. 111 బంతుల్లోనే 19 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేశాడు. ఆతిథ్య‌‌‌ బౌలర్ల దెబ్బకు కోహ్లీ, పుజారా, గిల్, విహారి తక్కువ స్కోర్లకే ఔటైన వేళ.. పంత్ ఆరో వికెట్ కు రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్‌‌‌‌)తో  222 పరుగుల కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. 

వన్డే స్టయిల్ బ్యాటింగ్ తో ప్రతీ బౌలర్ పై ఫోర్లు, సిక్సర్లతో ఎదురు దాడి చేశాడు పంత్.  ఈ క్రమంలో రిషబ్‌‌ 89 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉండటం ద్రవిడ్ శైలి. తను ఇలా భావోద్వేగాలను ప్రదర్శించడం చాలా అరుదు. దాంతో, పంత్ సెంచరీకి ద్రవిడ్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. పంత్ సెంచరీ కంటే ద్రవిడ్ రియాక్షనే హైలైట్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!