దళితబంధు ద్వారా ‘ఎయిర్‌టెక్‌’ కొనుగోళ్లు

  • 50 యంత్రాలు అవసరమని జలమండలి నిర్ణయం
  • హైదరాబాద్‌ కలెక్టర్‌కు ఎండీ లేఖ
  • ఒక్కో యంత్రంతో ముగ్గురికి ఉపాధి
  • ఇప్పటికే ప్రతిపాదనలు పంపించిన గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు

నిరుపేద దళిత కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చేస్తున్న దళితబంధు పథకం ద్వారా మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తున్నది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో మురుగునీటి వ్యవస్థలో వినియోగించే మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాల పంపిణీతో అటు ఆర్థికంగా…ఇటు ఉపాధిపరంగా దళిత కుటుంబాల్లో వెలుగు నింపేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు జలమండలి ఎండీ దానకిశోర్‌ హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. తమ పరిధిలో 50 యంత్రాల వినియోగానికి అవకాశముందని తెలియజేయడంతో దళితబంధు పథకం కింద ఆ మేరకు యంత్రాలను కొనుగోలు చేసి…తద్వారా ఒక్కో వాహనంతో ముగ్గురి చొప్పున ఉపాధి కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికితోడు గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు ప్రతిపాదనలు పంపుతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు,జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ ఇప్పటికే జలమండలి ఎండీకి ప్రతిపాదనలు ఇచ్చారు.

మానవ ప్రమేయం లేకుండా.. 
నగరంలో మురుగునీటి వ్యవస్థ నిర్వహణ పెద్ద సవాల్‌. చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న గల్లీలు ఉన్నందున అధునాతన యంత్రాలను చిన్నవాటిని కూడా వినియోగించాల్సి వస్తుంది. ప్రధానంగా మానవ ప్రమేయం లేకుండా మురుగునీటి వ్యవస్థ నిర్వహణ చేపడుతున్న జలమండలి అధికారులు ఎయిర్‌టెక్‌ యంత్రాల వినియోగాన్ని భారీగా పెంచారు. దేశంలోనే మొదటిసారి 70 జెట్టింగ్‌ యంత్రాలను సివరేజీ క్లీనింగ్‌ కోసం వినియోగిస్తున్న జలమండలి…దళిత్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (డిక్కీ) సౌజన్యంతో ఒక్కో వాహనానికి రూ.26 లక్షలు వెచ్చించి పుణె నుంచి దిగుమతి చేసుకుంది. ఈ యంత్రాల వినియోగంతో మురుగు నిర్వహణ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన వినియోగిస్తున్న ఈ మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాలతో ఒక్కో యంత్రం ద్వారా ఒక షిప్టులో గరిష్టంగా 500 రన్నింగ్‌ మీటర్‌ మేర నిర్వహణ చేపడుతున్నారు. ఒక రన్నింగ్‌ మీటర్‌కు రూ.11.70 చొప్పున సదరు యజమానికి చెల్లిస్తారు. ఇలా ఒక్కో వాహనానికి నెలకు రూ.2.10 లక్షల చొప్పున ఏడాదికిగాను 70 వాహనాలకు గాను రూ. 14.90 కోట్ల మేర దళిత కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.

దళితబంధులో అమలుకు ప్రణాళిక…
గతంలో మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాల ద్వారా నిరుపేద దళిత కుటుంబాలకు ఆర్థికంగా పెద్దఎత్తున ఊరట లభిస్తున్నది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరి దళితబంధు కింద కూడా మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాల పంపిణీతో మరిన్ని దళిత కుటుంబాలను ఆర్థికంగా ఉన్నతికి తీసుకురావాలనే బృహత్తర ప్రణాళిక చర్చకు వచ్చింది. మంత్రి తలసాని, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ కూడా మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాలను దళితబంధుతో అనుసంధానం చేస్తే ఆ కుటుంబాలకు మేలు చేసినట్లవుతుందని ప్రతిపాదించారు. పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.పది లక్షల చొప్పున ఇస్తుండగా…మినీ ఎయిర్‌టెక్‌ యంత్రం విలువ రూ.26 లక్షల వరకు ఉంది.ఈ నేపథ్యంలో దీన్ని ఎలా అమలు చేయాలనే దానిపై విధివిధానాలు ఖరారు చేయనున్నారు. ఇద్దరు, ముగ్గురు చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కో యంత్రాన్ని కొనుగోలు చేస్తారా? లేక ఎవరైనా లబ్ధిదారుడు ప్రభుత్వమిచ్చే మొత్తంతోపాటు మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారా? అనేది త్వరలో నిర్ణయించనున్నారు. ఒక్కో ఎయిర్‌టెక్‌ యంత్రంలో ఒక డ్రైవర్‌తోపాటు ఇద్దరు సహాయకులు అవసరం. అంటే ఒక యంత్రం ద్వారా ముగ్గురికి ఉపాధి లభిస్తుంది. 50 యంత్రాల ద్వారా 150 మందికి నేరుగా ఉపాధి లభించనుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!