త్వరగా కోలుకో నాన్నా: లాలూ ప్రసాద్ యాదవ్ కూతురి భావోద్వేగం

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం తన నివాసంలో ఆయన మెట్లపై నుంచి జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన వీపుకు గాయమయింది. భుజం విరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లాలూ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. 
మరోవైపు తన తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ… ‘నాన్నే నా హీరో. నా బ్యాక్ బోన్. త్వరగా కోలుకో నాన్నా. ఎన్నో అవరోధాలను జయించారు. కోట్లాది మంది ప్రార్థనలే ఆయన శక్తి’ అని ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో లాలూ చికిత్స పొందుతున్న ఫొటోలను ఆమె షేర్ చేశారు. రోహిణీ ఆచార్య సింగపూర్ లో ఉంటున్నారు.
 మరోవైపు ఈరోజు ఆర్జేడీ 26వ వ్యవస్థాపక దినోత్సవం. అయితే, తమ అధినేత లాలూ ఆసుపత్రిలో ఉండటంతో వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. ఇంకోవైపు, తన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కు లాలూ పార్టీ పగ్గాలను అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!