తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 416 ఆలౌట్… మ్యాచ్ కు వర్షం అంతరాయం

బర్మింగ్ హామ్ లో మరోసారి వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లండ్ 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ లీస్ ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ జాక్ క్రాలే (7 బ్యాటింగ్), ఓలీ పోప్ (0 బ్యాటింగ్) ఉన్నారు. 
కాగా, రెండోరోజు ఆట ఆరంభంలో టీమిండియా ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. ఓవర్ నైట్ స్కోరు 338/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా… వేగంగా ఆడింది. ఈ క్రమంలో జడేజా సెంచరీ పూర్తి చేసుకోగా, తాత్కాలిక సారథి బుమ్రా (31 నాటౌట్) బ్యాట్ తో రెచ్చిపోవడం హైలైట్ గా నిలిచింది. బుమ్రా 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు బాదాడు. అంతకుముందు సెంచరీ పూర్తి చేసుకున్న జడేజా (104) ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

షమీ 16 పరుగులు చేయగా, సిరాజ్ 1 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో అవుటయ్యాడు. ఈ వికెట్ కూడా ఆండర్సన్ ఖాతాలో చేరింది. ఈ మ్యాచ్ లో ఆండర్సన్ 5 వికెట్లు తీశాడు. ఇతర ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ 2, బ్రాడ్ 1, స్టోక్స్ 1, రూట్ 1 వికెట్ పడగొట్టారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!