తన కోడింగ్ నైపుణ్యంతో విజేతగా నిలిచిన భారత కుర్రాడు…వెనక్కి తగ్గిన అమెరికా కంపెనీ

భారతీయుల టెక్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచస్థాయి ఐటీ సంస్థల్లో మనవాళ్లదే హవా. సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల వంటివారు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. అనేక కోడింగ్ పోటీల్లోనూ, బగ్ ఫైండింగ్ కాంపిటీషన్స్ లోనూ భారతీయులు సత్తా చాటడం తెలిసిందే. 

తాజాగా, వేదాంత్ దేవ్ కాటే అనే మహారాష్ట్ర కుర్రాడు అమెరికాకు చెందిన ఓ సంస్థ నిర్వహించిన కోడింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు. కేవలం రెండ్రోజుల్లో 2,066 లైన్ల కోడ్ ను రాశాడు. తన తల్లికి చెందిన పాత ల్యాప్ టాప్ పై కోడింగ్ తో కుస్తీలు పట్టే వేదాంత్ దేవ్ కాటే ది న్యూజెర్సీ అడ్వర్టయిజింగ్ కంపెనీ నిర్వహించిన పోటీలో నెంబర్ వన్ గా నిలిచాడు. 1000 మంది పోటీల్లో పాల్గొంటే మనవాడ్నే విజయలక్ష్మి వరించింది. 

దాంతో, ఆ అమెరికా కంపెనీ ఏడాదికి రూ.33 లక్షల వేతనంతో ఉద్యోగం ఆఫర్ చేసింది. తమ కంపెనీలో చేరి ఇతర కోడింగ్ నిపుణులపై మేనేజర్ గా వ్యవహరించాలని కోరింది. అయితే, వేదాంత్ దేవ్ కాటే వయసెంతో తెలసుకున్న తర్వాత ఆ కంపెనీ తన ప్రతిపాదన వెనక్కి తీసుకుంది. హేమాహేమీ కోడర్లను వెనక్కినెట్టిన ఆ కుర్రాడి వయసు కేవలం 15 ఏళ్లే. దాంతో, అంత చిన్నపిల్లవాడ్ని ఉద్యోగంలోకి తీసుకోలేమని ది న్యూజెర్సీ అడ్వర్టయిజింగ్ కంపెనీ విచారం వ్యక్తం చేసింది. 

అంతమాత్రాన వేదాంత్ నిరాశ చెందనక్కర్లేదని, చదువు పూర్తయిన తర్వాత తమను సంప్రదించాలని సూచించింది. అతడి ప్రతిభ పట్ల తమ బృందం ఎంతో సంతృప్తి చెందిందని, అతడి ఆలోచనలను తమ కంపెనీ కార్యకలాపాల్లో పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు వేదాంత్ కు లేఖ రాసింది. 

వేదాంత్ దేవ్ కాటే టీనేజి వయసులోనే ఓ వెబ్ సైట్ (animeeditor.com) రూపొందించడం విశేషం. వతోడా ప్రాంతంలో నారాయణ ఇ-టెక్నో స్కూల్లో చదువుతున్న ఈ కుర్రాడు పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ లో సొంతంగా రాడార్ ను తయారుచేసి బంగారుపతకం సాధించాడు. అతడి తల్లిదండ్రులు రాజేశ్, అశ్విని నాగపూర్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్లు.

Nationalist Voice

About Author

error: Content is protected !!