డబ్బున్నోళ్లు రైతుబంధును వదులుకోవాలి : ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్

తెలంగాణ ప్రభుత్వం  ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5వేల రూపాయల చొప్పున ఇస్తోంది. ఏటా రెండు విడుతల్లో ఈ డబ్బులు ఇస్తున్నారు. అంటే రెండు సీజన్‌లకి కలిపి ఎకరాకు రూ.10వేలు సాయం చేస్తోంది. పంట వేసే సమయంలో పెట్టుబడికి డబ్బులు లేకుండా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం చేస్తోంది. ఐతే ఎంతో మంది ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సంపన్న కుటుంబాలు కూడా రైతు బంధు పథకం కింద డబ్బులు తీసుకుంటున్నాయి. వ్యవసాయం చేయకున్నప్పటికీ.. వ్యవసాయ భూమ కలిగి ఉన్నందున కోట్లల్లో డబ్బులు పొందుతున్నారు. అలాంటి వారంతా రైతు బంధు డబ్బులను వదులుకోవాలని హైదరాబాద్‌కు చెందిన ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్  వ్యవస్థాపకులు గాదగోని చక్రధర్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఏటా రైతుబంధు స్కీం ద్వారా దాదాపు 15 వేల కోట్ల నిధులు విడుదలవుతున్నాయని… ఆ నిధులలో అధికశాతం అసలు రైతులకన్నా కొసరు రైతులకే పోతుండడం బాధాకరమని చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గివిటప్ రైతుబంధు క్యాంపేయిన్‌కి ఆయన పిలుపునిచ్చారు. డబ్బున్నోళ్లంతా రైతు బంధును వదులుకుంటే.. రైతులకు మరింత మేలు జరుగుతుందని అంటున్నారు.

”వాస్తవానికి రైతుబంధు పథకం చాలా గొప్పది. కానీ దాని ప్రయోజనాలు అసలు రైతులకన్నా ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చివరకు సర్పంచ్‌లకే ఎక్కువగా కలుగుతున్నాయనేది దురదృష్టకరం. వీళ్ళలో చాలా మంది ఐదెకరాల కన్నా ఎక్కువ భూములు కలిగి ప్రభుత్వ బంగళాల్లో నివసిస్తూ, ప్రభుత్వ వాహనాల్లో తిరుగుతూ చివరికి ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళకే దక్కేలా చూసుకుంటున్నారు. ఈ ఒరవడి మారాలి. రాజకీయ నేతలతో పాటు.. ఎందరో సినీ ప్రముఖులు, ప్రభుత్వోద్యోగులు, ఎన్నారైలు, రియల్ ఎస్టేట్ వెంచర్లను, రిజార్ట్‌లను వ్యవసాయ భూములుగా చూపిస్తూ రైతుబంధు పథకం నిధులను గడిస్తున్నారు. ఇది అసలు రైతును అవమానించడం కాకపోతే మరేమిటి? రైతులకోసం పోరాడతాం అంటూ రోడ్లెక్కే ప్రతిపక్షాల నేతలు కూడా రైతుబంధు పథకాన్ని పొందుతున్నారంటే హాస్యాస్పదంగా ఉంది. ఇకపై ప్రభుత్వాన్ని విమర్షించే ముందు తమ రైతుబంధును ఒదులుకుని ప్రశ్నించాలని వాళ్ళందరినీ కోరుతున్నాను.” అని చక్రధర్ గౌడ్ పేర్కొన్నారు.

ఆత్మహత్య చేసుకుని కుటుంబాన్ని అనాధల్లా ఒదిలేసి పోతున్న వాళ్ళకు అండగా ఏ ఒక్కరూ నిలబడటం లేదని చక్రధర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హులందరూ రైతుబంధు పథకాన్ని ఒదులుకుంటే అవే నిధులతో వేల రైతు కుటుంబాలను ఆదుకున్నవాళ్లు అవుతారని తెలిపారు. ఆ భరోసా రైతన్నలలో కలిగిస్తే తెలంగాణలో రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోరని అభిప్రాయపడ్డారు. అసలైన, అర్హత కలిగిన రైతులకే డబ్బులను అందజేయగలిగితే తెలంగాణలో రైతుల బతుకులు బంగారుమయం అవుతాయని చక్రధర్ గౌడ్ విన్నవించారు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నారైలంతా.. రైతు బంధును వదులుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!