టెన్త్‌ పేపర్ లీక్ కాలేదు… అది కుట్ర..!

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌ ప్రశ్నం లీక్‌ వార్తలు కలకలం సృష్టించాయి.. అయితే, ఎక్కడా టెన్త్‌ పేపర్‌ లీక్‌ కాలేదని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దురుద్దేశంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఉదయం 9:30 గంటల కంటే ముందుగా పేపర్ బయటకొస్తే లీక్‌గా భావిస్తారని, నంద్యాలలో పేపర్ లీక్ అంటూ కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. కుట్రకు పాల్పడిన వారిపైనా, టీచర్లపైనా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ అయిందంటూ నిన్నో సంఘటన జరిగితే.. ఇవాళో ప్రచారం జరిగింది. ఇక, ఇవాళ కూడా అదే తరహాలో లీక్ జరిగిందంటూ ప్రచారం పెట్టారన్నారు.. ఇవాళ, నిన్న పేపర్‌ లీక్ కాలేదు, కాపీయింగ్ కూడా జరగలేదని స్పష్టం చేశారు.

అయితే, ఇలాంటి ప్రచారంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించేందుకు కుట్రలు పన్నినట్టు గుర్తించామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ… నారాయణ, ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో పని చేస్తోన్న వారే దీనికి కారకులనే నిర్ధారణకు వస్తున్నాం.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పరీక్షలను నిర్వహిస్తోంటే.. ఈ తరహా ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. 24 పేజీల బుక్ లెట్లల్లో పరీక్షలు రాస్తుంటే.. అన్సర్ షీట్లు బయటకు వచ్చేస్తున్నాయని ప్రచారం కరెక్టేనా..? ఆరు లక్షలకు పైగా విద్యార్ధినీ విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే.. వారిని మానసిక క్షోభకు గురి చేసేలా వ్యవహరించడం సరైన పనేనా..? అంటూ మండిపడ్డారు. విద్యార్ధినీ, విద్యార్థులెవ్వరూ లీకేజీ ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసిన ఆయన.. చక్కగా వెళ్లి పరీక్షలు రాయండి.. తప్పు జరిగితే ఒప్పుకుంటాం.. సరిదిద్దుకుంటాం అన్నారు.

పరీక్షలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాం.. నిన్న, ఇవాళ ఎక్కడ లీకులు కానీ.. మాల్ ప్రాక్టీస్ కానీ జరగలేదు.. ఈ కుట్రకు కారణాలేంటనేది ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. పదో తరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు చంద్రబాబు ఈ తరహాలో కుట్రలు పన్నుతున్నారని రాజకీయ కోణంలో నేను భావిస్తున్నానని తెఇపారు.. ఇక, వార్డ్ బాయ్‌గా తొమ్మిదో తరగతి అబ్బాయిని పెట్టడం తప్పే నని.. సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి బొత్స.

Nationalist Voice

About Author

error: Content is protected !!