టీఆర్ఎస్ అడ్డంగా దొరికిపోయిందని అందరూ అనుకుంటుండటం తాజా పరిణామం: విజయశాంతి

  • తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందంటున్న టీఆర్ఎస్
  • ఇదంతా కేసీఆర్ వింత విచిత్ర విన్యాసమన్న విజయశాంతి
  • ఇందులో దొరికిన వారంతా టీఆర్ఎస్ వాళ్లేనని వ్యాఖ్య
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు జరిగాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అయితే, వీరిని రిమాండ్ కు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వింత విచిత్ర విన్యాసం అని ఆమె అన్నారు. ఈ కథలో కత్తి బీజేపీది కాదు, నెత్తి బీజేపీది కాదు… దొరికినోళ్లంతా టీఆర్ఎస్ వాళ్లేనని చెప్పారు.

అయ్య (కేసీఆర్) చేసిన ప్రయోగాన్ని సమర్థించుకోలేక… దీనిపై టీఆర్ఎస్ వాళ్లు ఎవరూ మాట్లాడొద్దని కుమారుల వారు (కేటీఆర్) చెప్పారని విజయశాంతి ఎద్దేవా చేశారు. మాట్లాడిన కొద్దీ వారి మోసం ఎక్కువ బయటపడుతుందని అనుమానపడుతున్నారని చెప్పారు. పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారని, ఏసీబీ కూడా వారి నియంత్రణలోనే ఉందని… దొరికిందన్న డబ్బుకు ఆధారాలు చూపించడం లేదని అన్నారు. న్యాయం కోసం హైకోర్టును బీజేపీ ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ అధ్వానపు ప్రయత్నంలో టీఆర్ఎస్ అడ్డంగా దొరికిపోయిందని తెలంగాణ ప్రజలు భావిస్తుండటం ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామమని అన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!