జయలలిత మరణంపై సంచలన ఆరోపణలు చేసిన శశికళ

  • జైలులో ఉన్నప్పుడు కమిషన్‌కు అఫడవిట్ ఇచ్చిన శశికళ
  • 1984 నుంచే అక్కతో తనకు పరిచయం ఉందన్న శశి
  • డీఎంకే తమ కారును లారీతో ఢీకొట్టించి హత్యాయత్నం చేసిందని ఆరోపణ
  • డీఎంకే అక్రమ కేసులతో మనస్తాపం చెందారన్న శశి
  • జైలుకు వెళ్లొచ్చిన తర్వాత అనారోగ్యం పాలయ్యారన్న జయ నెచ్చెలి
మిస్టరీగా మారిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానికి సంబంధించిన వార్తలు ఇటీవల మళ్లీ వరుసగా వెలుగుచూస్తున్నాయి. అర్ముగస్వామి నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత అందులో పేర్కొన్న కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికలో కమిషన్ పలు అనుమానాలను లేవనెత్తింది. అలాగే, జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వైద్యులతో మాట్లాడిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చి సంచలనమైంది. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన జయ నెచ్చెలి శశికళ శిక్ష అనుభవిస్తున్నసమయంలో కమిషన్‌కు సమాధానమిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. తాజాగా, ఇందులోని కొన్ని అంశాలు వెలుగు చూశాయి.

అందులో శశికళ పేర్కొన్న ప్రకారం.. జయలలితతో శశికళకు 1984 నుంచి స్నేహం ఉంది. ఎంజీఆర్ మరణం తర్వాతి నుంచి జయతోపాటు శశికళ పోయెస్ గార్డెన్‌లో ఉన్నారు. ఆ తర్వాత అదే ఆమె శాశ్వత చిరునామా అయింది. ఈ క్రమంలోనే జయను అక్కా అనేంత చనువు ఏర్పడింది. జయపై శశికళ అన్యాయంగా కేసులు పెట్టించిందని, వాటిని కూడా ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారని శశికళ ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 24 ఫిబ్రవరి 2019న తాము పుదుచ్చేరి నుంచి తిరిగి వస్తుండగా తమ కారును లారీతో ఢీకొట్టించడం ద్వారా తమను అంతం చేయాలని డీఎంకే ప్రయత్నించిందని, దేవుడి దయవల్ల తాము బతికి బయటపడ్డామని పేర్కొన్నారు.

నేనెప్పుడూ రాజకీయాల్లో తలదూర్చలేదు
2016 ఫిబ్రవరి, మార్చి నెలల్లో అక్క (జయలలిత)కు నడవడం కష్టమైందని, వైద్యులు మందులు రాసినా వాటిపై స్పష్టత వచ్చే వరకు వాడేవారు కాదని శశికళ అఫిడవిట్‌లో తెలిపారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో నడవలేని స్థితిలో ఉండడంతో కారు దిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయించుకున్నట్టు పేర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్లే జయ ఆ ఎన్నికల్లో ఆర్కే నగర్ నుంచి పోటీ చేసినట్టు శశికళ అఫిడవిట్‌లో వివరించారు. తానెప్పుడూ రాజకీయాల్లో తలదూర్చలేదని, ప్రజా సంక్షేమం కోసం అక్కను కాపాడుకుంటూ వచ్చానన్నారు. 2014లో తాను కూడా అనారోగ్యానికి గురయ్యానని, వైద్య పరీక్షల కోసం జయ అపోలోకు వెళ్లినప్పుడు తాను కూడా పరీక్షలు చేయించుకునే దానినని తెలిపారు.

2016 ఎన్నికలకు ముందు నుంచి జయ ఆదేశాల మేరకు ఆమెకు అందే వైద్యానికి సంబంధించి వీడియోలు తీసి చూపించేదానని శశికళ తెలిపారు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా ఇలాగే చేసినట్టు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో ఆమెకు వైద్యం బాగానే అందిందని, ఆమె కోరిక మేరకు అపోలోలో ప్రత్యేకంగా వంట గది కూడా ఏర్పాటు చేశారన్నారు. అక్క గది పక్కనే తనకు కూడా గది కేటాయించారని తెలిపారు. అక్క గదిలో ఏర్పాటు చేసిన టీవీలో ‘జై వీర హనుమాన్’ సీరియల్ చూసేవారని వివరించారు. నచ్చిన పాటల్ని డీవీడీలో వేసి వినిపించే వారని పేర్కొన్నారు.

నావైపు చూసి చేతులు చాచింది
డిసెంబరు 4న సాయంత్రం 4.20 గంటలకు అక్క ‘జై వీరహనుమాన్’ సీరియల్ చూస్తున్నారని, అప్పటికే తెచ్చిన బన్, కాఫీ చల్లారిపోతోందని చెబితే సీరియల్ అయ్యాక తీసుకుంటానని చెప్పారని శశికళ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత బన్ తినేందుకు ట్రాలీని దగ్గరకు లాక్కున్నారని, అప్పుడు ఆమె పక్కన నర్సు కూడా ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ఆమె శరీరంలో వణుకు మొదలైందని, నాలుకను పళ్లతో కొరుకుతోందని అన్నారు. అది చూసి తాము షాకయ్యామని, అక్క తనవైపు చూస్తూ చేతులు చాచిందని, దీంతో ఆమెను పట్టుకుని బెడ్‌పై పడుకోబెట్టినట్టు పేర్కొన్నారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటు వచ్చిందని చెప్పారని, ఆ రోజున ఆమె గుండె సరిగా కొట్టుకోలేదని అన్నారు. ఎక్మో చికిత్సతో అక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించామని, కానీ 5వ తేదీన ఆమె స్పందించడం లేదని, నిర్ణయం తీసుకోమని చెప్పినప్పుడు తాను మూర్ఛపోయానని పేర్కొన్నారు.

డీఎంకే వేసిన మచ్చ వల్లే

27 సెప్టెంబరు 2014న బెంగళూరు స్పెషల్ కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పు చెప్పిందని, ఫలితంగా అక్క సీఎంగా దిగిపోయి జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. 22 రోజుల జైలు జీవితంలో తనపై జరిగిన పరువు నష్టాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని అనుకున్నారని అన్నారు. బెయిలు వచ్చిన తీవ్ర మానసిక క్షోభ అనుభవించారని, అక్కపై డీఎంకే పెద్ద మచ్చే వేసిందని పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆమె అరోగ్యం దెబ్బతిందని, అనారోగ్యం పాలయ్యారని శశికళ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అక్క విషయంలో తాను ఏ తప్పూ చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని శశి ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!