‘చరిత్రపుటల్లో తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

ప్రొఫెసర్ లక్ష్మణ్ సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న పుస్తకం ‘చరిత్రపుటల్లో తెలంగాణ’. ఇవాళ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సెంట్రల్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పలువురు ప్రొఫెసర్లు ఈ పుస్తక రచనలో పాలుపంచుకున్నారు. తెలంగాణ చరిత్రను, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలను, పోరాటాన్ని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు, జాతరలను ఈ పుస్తకంలో పొందుపరిచారంటూ మంత్రి కేటీఆర్ ప్రొఫెసర్లను కొనియాడారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ, మతం రాజకీయ పార్టీ ముసుగులో రంగప్రవేశం చేస్తే దేశం అయోమయానికి గురవుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఎప్పుడూ ఉంటారని, ఇప్పుడు కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఎదురుతిరగడంతో దేశంలో మరిన్ని గొంతుకలు ఆయన బాటలో ఎలుగెత్తుతాయని వివరించారు. 

మత్తుమందులా తయారైన మతం పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. యువత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేకపోతే కులం, మతం పేరిట కొట్లాడుకునే విష విలయాల్లో చిక్కుకుంటారని పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసే విద్యార్థులు దేశంలో ఇప్పుడు జరుగుతున్న ఘటనలపై దృష్టి సారించాలని సూచించారు. దేశంలో మానవతపై దాడి జరుగుతున్న విషయాన్ని యువత గమనించాలని కేటీఆర్ పేర్కొన్నారు. కుల, మత ప్రస్తావనల్లో కొట్టుకుపోతే దేశాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతుందని స్పష్టం చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!