గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాదిపాటు నిర్బంధం.. కోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

  • రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేయడాన్ని హైకోర్టులో సవాలు చేసిన ఆయన భార్య
  • కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా రాజాసింగ్ ప్రసంగించారన్న ప్రభుత్వ న్యాయవాది
  • ఆయన నిర్బంధాన్ని సలహా మండలి కూడా ఆమోదించిందని వివరణ
  • చట్ట నిబంధనలు ఉల్లంఘించి ఉత్తర్వులు జారీ చేసిందన్న పిటిషనర్ తరపు న్యాయవాది
కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా ప్రసంగించిన కేసులో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను 12 నెలలపాటు నిర్బంధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాజాసింగ్‌ను పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఆయన భార్య ఉషాభాయ్ హైకోర్టులో సవాలు చేశారు. జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముజీబ్ కుమార్ సదాశివుని కోర్టులో వాదనలు వినిపించారు.

కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా రాజాసింగ్ టీవీల్లో ప్రసంగించారని, వీటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీడీ యాక్ట్ కింద నిర్బంధించామని తెలిపారు. ఆయన నిర్బంధాన్ని సలహా మండలి కూడా ఆమోదించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయనను 12 నెలలపాటు నిర్బంధిస్తూ ఈ నెల 19న జీవో జారీ చేసినట్టు చెప్పారు.

మరోవైపు, పిటిషనర్ తరపు న్యాయవాది రామచంద్రరావు తన వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించి నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో కల్పిస్తున్న ధర్మాసనం.. ప్రభుత్వ జీవోను సవాలు చేశారా? అని న్యాయవాదిని ప్రశ్నించింది. సవరణ పిటిషన్ దాఖలు చేస్తామని రామచంద్రరావు చెప్పడంతో కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!