కేసీఆర్ పై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: హరీశ్ రావు

  • కేసీఆర్ సభతో బీజేపీ నేతలకు కంటిమీద కునుకు కరవైందన్న హరీశ్
  • కిషన్ రెడ్డి స్థాయి ఏంటో ఢిల్లీ నుంచి వచ్చిన దూతలే చెప్పారని ఎద్దేవా
  • మునుగోడులో 99 శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయని వ్యాఖ్య
బీజేపీ నేతలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుమాలిన, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ నకిలీ, మకిలీ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. గల్లీ నేతలకంటే దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పడం బీజేపీ డీఎన్ఏలోనే ఉందని చెప్పారు. గత ఎనిమిదేళ్ల కాలంలో తాము ఏం చేశామో నిరూపిస్తామని అన్నారు. కిషన్ రెడ్డికి ఎంత స్థాయి ఉందో ఢిల్లీ నుంచి వచ్చిన దూతలే చెప్పారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభతో బీజేపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని అన్నారు.

తెలంగాణలో ఇతర నియోజకవర్గాల కంటే ఎక్కువగా రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందిన నియోజకవర్గం మునుగోడు అని హరీశ్ చెప్పారు. మునుగోడులో 99 శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ నీటి సరఫరా కల్పించామని.. నాలుగేళ్ల నుంచి మునుగోడు మహిళలు బిందె ఎత్తడం కూడా మానేశారని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే నిధులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసిందని… వారు రాసిన లేఖ ప్రకారం మీటర్లు పెడితే ఏడాదికి రూ. 6 వేల కోట్ల నిధులు వస్తాయని హరీశ్ చెప్పారు. ఈ నిధుల కోసం కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మీటర్లు పెడుతున్నాయని తెలిపారు. తమకు రైతుల సంక్షేమమే ముఖ్యమని… అందుకే మీటర్లను పెట్టడం లేదని చెప్పారు. ఉచిత్ విద్యుత్ ఇవ్వొద్దని కూడా కేంద్రం చెపుతోందని విమర్శించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!