కేసీఆర్ కుటుంబంపైనే నా యుద్ధం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబంపై యుద్ధం ప్రకటిస్తా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను ప్రకటించబోయే యుద్ధం రాజకీయ పార్టీల మధ్య యుద్ధం కాదని.. కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే చివరి యుద్ధం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంతో చేయబోయే యుద్ధాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే యుద్ధంగా, ధర్మ యుద్ధంగా కోమటిరెడ్డి అభివర్ణించారు. మునుగోడు ప్రజలతో చర్చించి ప్రజా సమస్యల కోసం కృషి చేస్తానని చెప్పిన ఆయన.. రాబోయే 10 – 15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా అని స్పష్టంచేశారు. 

మునుగోడు ప్రజల తీర్పు కీలకం..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మునుగోడు నియోజకవర్గం ప్రజల తీర్పు కీలకం అవుతుందన్నారు. అంతేకాదు.. మునుగోడు ప్రజల తీర్పు తెలంగాణ ప్రజల మార్పుగా భావించవచ్చన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్నో సమస్యలపై మాట్లాడానని.. కానీ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఒక్క గజ్వేల్ నియోజకవర్గం, సిరిసిల్ల నియోజకవర్గం లేదా సిద్ధిపేట నియోజకవర్గం అన్న చందంగా పరిస్థితిని తయారు చేశారు. అంతకు మించి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. 

అమిత్ షాను కలిసినప్పటి నుండే..
తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసిన తరువాత రాజీనామా అంశం గురించి తాను చర్చించకపోయినా, పార్టీ మారతా అని చెప్పకపోయినప్పటికీ.. మీ పేపర్లలో బేరసారాలు అంటూ ఆరోపణలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనుకున్నంత మాత్రాన్నే మునుగోడులో ఉపఎన్నిక రాదని.. అది మునుగోడు ప్రజలు నిర్ణయిస్తే వస్తుందని కోమటిరెడ్డి అన్నారు. ఏదేమైనా మునుగోడు తీర్పు తెలంగాణ రాజకీయాలను మార్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని.. ఇది తెలంగాణలో మార్పు కోరుకుంటున్న ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జరిగే యుద్ధం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి కనీసం అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు..
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను నోరు మూయించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేలకు రావాల్సిన హక్కులను సీఎం కేసీఆర్ హరించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఈ ఉపఎన్నిక యుద్ధంపైనే తెలంగాణ ప్రజల భవిష్యత్తు, ఆత్మగౌరవం ఆధారపడి ఉన్నాయని కోమటిరెడ్డి  వ్యాఖ్యానించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!