కేసీఆర్‌కు ఓటేస్తేనే దళిత బంధు.. లేదంటే ఇవ్వం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం దళితు బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఆర్థికంగా వెనకబడి ఉన్న దళితులకు చేయూతనిచ్చి.. వారి ఆదాయాన్నిపెంచడమే లక్ష్యంగా.. దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రూ.10 లక్షలతో ట్రాక్టర్లు, కార్లు, పౌల్ట్రీ ఫామ్ వంటి యూనిట్లను మంజూరు చేస్తున్నారు. మొదట హుజురాబాద్  నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి.. ఇప్పుడు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇస్తున్నారు. అర్హులైన దళితులకు రూ.10 లక్షల విలువైన యూనిట్లను అందజేస్తున్నారు. వాటితో వ్యాపారం చేసి.. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం..! ఐతే ఈ దళిత బంధు పథకంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌కు ఓటేసే వారికి మాత్రమే దళిత బంధు ఇస్తామని..ఇందులో ఇలాంటి దాపరికం లేదని స్పష్టం చేశారు. 

    ” రామ్ సాగరా..? పంపించు.  ఒకటో రెండో ఉంటే పెడదాం. అర్హులు ఎవరైనా ఉంటే.. తెలంగాణ సోయి ఉన్నోళ్లు. అర్థమైంది కదా. ! ఎలాంటి దాపరికం లేదు.. ఎందుకు ఉండాలి? అంతకు ముందు నీళ్లు లేకుండె. ఇప్పుడు ఇస్తున్నాం. కరెంటు కూడా రాకుండె. కానీ  ఇప్పుడు ఇస్తున్నాం.  ఎదిగిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు సర్కారు పైసలిస్తోంది. గర్భిణీలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రసూతి చేస్తున్నాం. ఉల్టా పైసలు కూడా ఇస్తున్నాం కదా.. ! ఇవన్నీ నష్టమా, లాభమా తెలంగాణకు.  అందుకే ఆ సోయున్నోళ్లుంటే పెట్టియ్యి. ఆ సోయి లేకుంటే పెట్టకు. కేసీఆర్‌కే ఓటు వేస్తాం. తెలంగాణ గెలిపిస్తాం. అనేటోళ్లు ఉంటేనే పెట్టు. ఓపెన్ సీక్రెట్ ఇది. దాపరికం లేదు.” అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. ఓ సర్పంచ్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

            బుధవారం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఐతే తమ గ్రామంలో దళిత బంధు పథకం అమలు కావడం లేదని..అర్హులైన వారు చాలా మంది ఉన్నారని… రాంసాగర్ గ్రామ సర్పంచ్ రవీందర్ సభ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. కేసీఆర్‌ కు ఓటువేయాలన్న సోయి ఉన్న వారికే దళిత బంధు యూనిట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. దళిత బంధు నిధులను పక్కదారి పట్టిస్తున్నారని.. టీఆర్ఎస్ వారికే యూనిట్లను ఇస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. కేవలం టీఆర్ఎస్ వారికే ఇవ్వడానికి.. అవి పార్టీ డబ్బులు కాదని విమర్శిస్తున్నారు. మీరిచ్చే డబ్బులు ప్రభుత్వానివి.. వాటిని ప్రజలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!