కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

భార‌త ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి కోసం ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లు అవుతున్న నేప‌థ్యంలో అధికార బీజేపీ బుధ‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న బీజేపీ సీనియ‌ర్ నేత ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ చేత కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయించింది. పార్టీ ఆదేశాల మేర‌కు బుధ‌వారం సాయంత్రం న‌ఖ్వీ త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న న‌ఖ్వీ… కేంద్ర కేబినెట్‌లో మైనారిటీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీలో మైనారిటీ వ‌ర్గానికి చెందిన నేత‌గా న‌ఖ్వీకి మంచి ప్రాధాన్య‌మే ద‌క్కింది. ఈ క్ర‌మంలో ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఆయ‌న‌ను బ‌రిలోకి దించేందుకు బీజేపీ వ్యూహం ర‌చించింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. బుధ‌వారం జ‌రిగిన కేబినెట్ భేటీలో పాల్గొన్న న‌ఖ్వీ సేవ‌ల గురించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కీర్తించారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం న‌ఖ్వీ త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా బుధవారంతో పదవీకాలం ముగిసిన నేపథ్యంలోనే నఖ్వీ మంత్రి పదవికి రాజీనామా చేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Nationalist Voice

About Author

error: Content is protected !!