కృష్ణా జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

కృష్ణా జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఒకరు వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి కరెంట్‌ షాక్‌తో విగతజీవిగా మారగా.. మరొకరు ప్రేమించిన యువతితో పెండ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్నింగ్‌ వాకింగ్‌ చేస్తూ రోడ్డు దాటుతున్న ఓ రిటైర్డ్‌ ఉద్యోగిని బైక్‌ రూపంలో మృత్యువు ఎదురు వచ్చింది. ఈ కేసుల వివరాల్లోకి వెళ్తే..

పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంకు చెందిన భూక్య సతీష్ ( 25) వరి నారుమడికి నీరు పెట్టేందుకు మోటార్‌ ఆన్‌ చేస్తుండగా కరెంట్ షాక్‌కి గురై మృతిచెందాడు. భూక్యా శ్రీను బుజ్జి దంపతులకు ఇద్దరు సంతానం. ఏడాది క్రితమే కుమారుడు సతీష్‌కు పెళ్లవగా, భార్య ఎనిమిది నెలల గర్భిణి. సతీష్ గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విజయవాడ బైపాస్ రహదారిపై ఈవెనింగ్‌ వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతుండగా రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఎం ప్రకాష్ రావును బైక్‌ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. కాగా, చికిత్స అందిస్తుండగా ప్రకాష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు మహేష్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తుమ్మలపాలెం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొమ్మ శేషగిరిరావు బుధవారం మృతిచెందాడు. రెండేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 2001 నుంచి 2006 వరకు తుమ్మలపాలెం గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. కాగా, రాజీవ్‌ గాంధీ పార్క్‌ సమీపంలో కృష్ణలంక పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి 40 నుంచి 45 ఏండ్ల వయసు ఉంటుందని, పోస్ట్‌ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

ఇలాఉండగా, గంపలగూడెం మండలంలోని మర్లపాడులో కొంకి అశోక్‌ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఇష్టపడిన యువతితో పెండ్లి జరగడంలేదని తీవ్ర మనస్థాపానికి గురై ఈ నెల 18న రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!