కృష్ణయ్య లాంటి వ్యక్తిని బీసీల ప్రతినిధి అని చెప్పుకోవడానికి బీసీలు అవమానంగా భావిస్తున్నారు: బుద్ధా వెంకన్న

బుద్ధా వెంకన్న మీడియా సమావేశం
ఆర్.కృష్ణయ్యపై విమర్శలు గుప్పించిన నేత
కృష్ణయ్యకు నయీం గ్యాంగుతో సంబంధాలున్నాయని ఆరోపణ
బీసీలను జగన్ కు హోల్ సేల్ గా అమ్మేస్తున్నాడని వ్యాఖ్యలు

పూటకు ఒక పార్టీని మార్చే ఆర్.కృష్ణయ్య లాంటి వాళ్లను అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో బీసీలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ అగ్రనేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. కృష్ణయ్య మొదట టీడీపీలో ఉన్నాడని, తర్వాత కేసీఆర్ తో, అటు తర్వాత సొంత పార్టీ పెడుతున్నానని ప్రచారం చేసి ఇప్పుడు జగన్ తో ఉన్నారు… అందుకే ఇతనిని పూటకొక పార్టీ మార్చే వ్యక్తి అని అంటున్నాం అని బుద్ధా వెంకన్న వివరించారు.

కృష్ణయ్యకు నయీం గ్యాంగుతో కూడా సంబంధాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని బీసీల ప్రతినిధి అనడం సిగ్గుచేటని అన్నారు. ఆర్.కృష్ణయ్య బీసీలందరినీ జగన్ రెడ్డికి హోల్ సేల్ గా అమ్మేస్తున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తిని బీసీ ప్రతినిధి అని చెప్పుకోవడానికి బీసీలు అవమానంగా భావిస్తున్నారని తెలిపారు.

“గత ముప్పై ఏళ్లుగా బీసీలను అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసిన వ్యక్తి కృష్ణయ్య. మూడున్నరేళ్లలో 24 మంది బీసీలను హత్య చేయించిన జగన్ రెడ్డిని బీసీ ఉద్దారకుడు అని చెప్పేందుకు కృష్ణయ్యకు ఏమాత్రం సిగ్గులేదు.

జగన్ రెడ్డి కుటుంబ వైభవం బీసీల శవాలపై  నిర్మించుకున్నది. జగన్ రెడ్డి తాత రాజారెడ్డి జింకా వెంకటనరసయ్య అనే బీసీ వ్యక్తిని హత్యచేసి మంగంపేటలో బైరటీస్ గనిని కబ్జా చేశాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ జనగనణ చేయాల్సిందేనని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే దాన్ని వదిలేసిన వ్యక్తి జగన్ రెడ్డి.

బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ. మహానాయకుడు ఎన్టీఆర్ బీసీలను ఆర్ధికంగా, రాజకీయంగా  బలోపేతం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మరో నాలుగడుగులు ముందుకేసి బీసీ సాధికారత కోసం ఎంతో శ్రమించారు.

ఆర్ కృష్ణయ్య బీసీలకు న్యాయం చేస్తారని తలచి తెలంగాణలో చంద్రబాబునాయుడు ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. తెలుగుదేశం టికెట్ ఇచ్చారు. బీసీలను నిలువునా ముంచి తన స్వార్ధం కోసం వెళ్లిపోయిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఆల్ ఇండియా బీసీ సంఘం అధ్యక్షుడిగా ఆర్. కృష్ణయ్యను ఎవరూ ఎన్నుకోలేదు. తనకు తానే చెప్పుకుంటున్నారు.

ఆర్. కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచి తరువాత మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేశారు. 2019లో తగుదునమ్మా అని మంగళగిరిలో లోకేష్ బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఒక ఉద్యమకారుడు ఇన్ని పార్టీలు మారడం హాస్యాస్పదం. కులసంఘ నాయకుల్లో ఎక్కువ పార్టీలు మారిన వ్యక్తి ఆర్. కృష్ణయ్యే.

చంద్రబాబు వైపు బీసీలున్నందున బీసీలపై వైసీపీకి ప్రేమ పుట్టుకొస్తోంది. చంద్రబాబునాయుడు దగ్గర నుంచి బీసీలను దూరం చేయడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. 56 మందిని కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమించారు. వారికి కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. నిధులు లేవు. బీసీ సంక్షేమ నిధులు లేవు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగదు.

బీసీల వద్దకు వెళ్లి మా గోడు చెప్పుకుంటాం. బీసీల అభివృద్ధికి మేం పాటుపడతాం. ఈ ప్రభుత్వం బీసీల వ్యతిరేక ప్రభుత్వం. బస్ యాత్ర పెట్టి  వైసీపీ భరతం పడతాం. ఈ విషయాలన్నీ బస్సు యాత్ర ద్వారా తెలుపుతాం” అని వెల్లడించారు.

త్వరలో బీసీ అగ్ర నేతలందరూ కలిసి విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశంలో  వైసీపీ నేతలు బీసీల పట్ల వ్యవహరించిన తీరును ఎండగడతామని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!