కార్వీ కేసులో ఈడీ విచారణ స్పీడప్..రూ.110 కోట్ల ఆస్తుల అటాచ్..!

కార్వీ స్కామ్‌లో ఆ సంస్థకు చెందిన రూ.110 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. షేర్స్, భూములు, భవనాల షేర్స్, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలను జప్తు చేశారు. మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద ఇప్పటికే కార్వీపై ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో రూ.1,984.8 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. ఖాతాదారులకు చెందిన రూ.2 వేల 800 కోట్ల విలువైన షేర్లను కార్వీ సంస్థ తాకట్టు పెట్టింది. 

షేర్లను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంది. దీనిపై సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దాని ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ సంస్థ ఎండీ పార్థసారధికి చెందిన రూ.2 వేల 95 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల షేర్లను తమవేనంటూ బ్యాంకులను కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నమ్మించింది.

గత 8 ఏళ్లలో బ్యాంకుల నుంచి రూ.3 వేల 520 కోట్ల రుణం తీసుకుంది. ఆ రుణాన్ని వేర్వేరు సంస్థలకు మళ్లించేందుకు 20 డొల్ల కంపెనీలను కార్వీ సంస్థ ఎండీ పార్థసారధి ప్రారంభించారు. దీనిపై కొందరు సెబీకి వెళ్లారు. రంగంలోకి దిగిన సెబీ..కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ట్రేడింగ్‌పై నిషేధం విధించింది. బ్యాంకుల నుంచి రుణాలను కార్వీ సంస్థ చెల్లించకపోవడంతో పోలీసులను బ్యాంకుల ప్రతినిధులు ఆశ్రయించారు.

ఈకేసు విచారణలో భాగంగా కార్వీ సంస్థ ఎండీ పార్థసారధి, సీఎఫ్‌వో కృష్ణ హరిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా బెయిల్‌పై ఉన్నారు. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసుకున్న ఈడీ ఆ దిశగా విచారణ చేస్తోంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!